Pawan Kalyan: పవన్ కు బిగ్ ఆఫర్, కీలక బాధ్యతలు..!!
పవన్ కల్యాణ్ ఎన్డీఏలో కీలకంగా మారుతున్నారు. కొద్ది రోజుల్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక ల వేళ.. బీజేపీ నాయకత్వం పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్ల తెలుస్తోంది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలో కీలక చర్చలు జరిగాయని సమాచారం. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. రాజ్యసభ సీట్ల భర్తీలోనూ కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. ఇక, ఎన్డీఏ కోసం పవన్ కీలక బాధ్యతలు తీసుకునేందుకు సిద్దం అయ్యారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ అనేక అంశాల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు పార్టీ నేతల సమాచారం. తమిళనాడులో పవన్ కు అభిమానులు ఉండటంతో పాటుగా.. కొంత కాలంగా ఆ రాష్ట్ర రాజకీయాలు.. పరిణామాల పైన పవన్ స్పందిస్తున్నారు. అటు డీఎంకే, విజయ్ ప్రధాన ప్రత్యర్థులుగా అన్నా డీఎంకే తో జత కట్టిన బీజేపీ మరి కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు లో కూటమి తరపున ప్రచార బాధ్యతలు తీసుకోవాలని సూచన చేసినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ కు ముందే తమిళనాడు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించినట్లు పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇందుకు పవన్ సైతం సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పవన్ ఎన్డీఏకు మద్దతుగా ప్రచారం చేసారు.

కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన
ఇక, కేంద్రంలో త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటుగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి మరో మంత్రి పదవి ఖాయంగా దక్కే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ, టీడీపీ నుంచి మంత్రులుగా కొన సాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. ఈ సారి విస్తరణలో జనసేనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఏపీ నుంచి త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిల్లో రెండు బీజేపీ.. టీడీపీ - జనసేన చెరొకటి తీసుకునే విధంగా సూత్రప్రాయం గా నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. కాగా.. జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమేనని రమేశ్ తో పాటుగా ఒక సినీ ప్రముఖుడి పేరు రేసులో ఉన్నట్లుగా ప్రచారం. అదే సమయంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్ కు తిరిగి కొనసాగింపు ఉంటుందని సమాచారం. దీంతో..ఇప్పుడు పవన్ రాజ్యసభ స్థానం.. కేంద్ర మంత్రివర్గంలో అవకాశం పైన తీసుకునే తుది నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications