Year Ender 2025: పవన్ గ్రాఫ్ పెంచిన ఏడాది- డిప్యూటీ సీఎం నుంచి బీజేపీ అస్త్రంగా..!
రెండేళ్ల క్రితం వరకూ ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే నాన్-సీరియస్ పొలిటిషియన్, పార్ట్ టైమ్ పొలిటిషన్ ఇలా అనేక పదాలు వినిపించేవి. కానీ గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవే మాటలు రిపీట్ చేసేందుకు విపక్షాలకు సైతం ధైర్యం సరిపోవడం లేదు. దీనికి కారణం గతేడాది ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీల్ని కలిపి కూటమి ఏర్పాటు చేసి, 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాలు అందుకోవడమే. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ ఇప్పుడు బీజేపీ అమ్ములపొదిలో కీలక అస్త్రంగా కనిపిస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న చంద్రబాబుకు అగ్నికి వాయువు తోడైనట్లు పవన్ తోడయ్యారు. వీరిద్దరూ కలిసి కూటమిగా ఏర్పడితే దాని ఫలితం ఎలా ఉంటుందో 2014లోనే చూపించిన అనుభవమూ ఉంది. దీంతో మరోసారి వీరిద్దరూ బీజేపీని కలుపుకొని కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయంతో వైసీపీ డీలాపడిపోయింది. అక్కడి నుంచి వైసీపీ తిరిగి తేరుకోలేకపోయిందంటూ పవన్ వ్యూహాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. దీంతోనే గతేడాది ఎన్నికల్లో అప్రతిహత విజయాలు అందుతున్న పవన్.. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగానూ నిరూపించుకుంటున్నారు.

డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, అటవీశాఖల మంత్రిగా పవన్ ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ పల్లె పండుగ నుంచి మొదలుపెడితే తాజాగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల ఆటకట్టుగా నేరుగా చేసిన పర్యటనల వరకూ ప్రతిసారీ ఉనికి చాటుకుంటూనే ఉన్నారు. మొదట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రివ్యూలకే పరిమితమైన పవన్ .. ఆ తర్వాత క్షేత్రస్ధాయిలో వరుస టూర్లతో దుమ్ముదులుపుతున్నారు. దీంతో పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. కేబినెట్లో ఆయన ప్రశ్నిస్తే నిర్ణయాలూ మారిపోతున్నాయి.

ఓవైపు డిప్యూటీ సీఎంగా, కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూనే మరోవైపు సీఎం చంద్రబాబుకు తలలో నాలుకలా పవన్ వ్యవహరిస్తున్నారు. పవన్ అన్న అంటూ లోకేష్, నా స్నేహితుడు పవన్ అంటూ చంద్రబాబు ఆయన్ను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో మరో మిత్రపక్షం బీజేపీ అయితే ఏకంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో సైతం ఆయన్ను విస్త్రృతంగా వాడుకుంటోంది. తాజాగా బీహార్ ఎన్నికల్ని మినహాయిస్తే అంతకు ముందు జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి పవన్ ప్రచారం చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ ప్రశ్నించిన తీరు బీజేపీకి భవిష్యత్తుపై ఆశలు రేపింది. ఇలా గతేడాది కాలంలో పవన్ గ్రాఫ్ అమాతం పెరిగింది.












Click it and Unblock the Notifications