ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్దాల పోటీల్లో ప్రపంచ ఛాంపియన్లు: పేర్ని నాని
ఏపీలో కొనసాగుతున్న రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ను టార్గెట్ చేసిన ప్రశాంత్ కిషోర్ సంక్షేమ పథకాలు అందించిన అంత మాత్రాన ఓట్లు పడవని, ప్రజలు అభివృద్ధిని కూడా చూస్తారని వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈ విషయంలో పెద్ద తప్పు చేశారని, ఆయన చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణమవుతాయి అంటూ పీకే వ్యాఖ్యానించారు.
ఇక పీకే వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ మంత్రులు ఆయన పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పీకే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఒక పీకే వల్ల కావడం లేదని చంద్రబాబు మరో పీకే ని తెచ్చుకున్నారు అంటూ మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ ఏమి చేయలేక పోతున్నాడని చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ని తీసుకువచ్చారని మాట్లాడిన ఆయన, ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఓడిపోతున్నాడు అని, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గెలుస్తాడు అనుకుంటే మ్యానిఫెస్టోలో సంక్షేమం గురించి ఎడాపెడా హామీలు ఇచ్చేయాలని ఆయనకు పీకే ఎందుకు సలహా ఇచ్చారో చెప్పాలంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి సర్వే టీములు లేని పీకే వైసిపికి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెబుతారు అంటూ నిలదీశారు. చంద్రబాబు గెలిచే అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ తో, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు సూచించారో చెప్పాలని ప్రశాంత్ కిషోర్ కు సూటి ప్రశ్న వేశారు. నెలక్రితం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశం కారణంగా చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారని పేర్ని నాని వెల్లడించారు.
రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేకపోతే, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలలో గత ఐదు సంవత్సరాలుగా ఎలా ముందుకు వెళ్లాయో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. అంతేకాదు తాను మహా మాంత్రికుడిని అనుకుంటున్న ప్రశాంత్ కిషోర్, ప్రత్యక్ష రాజకీయాలలో సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయ బిచ్చగాడిగా మారాడని ఆయనను టార్గెట్ చేశారు.
ఇంట గెలవని వాడు రచ్చ గెలుస్తాడా అంటూ ప్రశాంత్ కిషోర్ పై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు అబద్ధాల పోటీలలో ప్రపంచ ఛాంపియన్లు అని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications