విజయసాయి రెడ్డికి వైసీపీ నుండి అనూహ్య మద్దతు
విజయసాయి రెడ్డికి వైసీపీ నుండి మద్దతు లభిస్తుంది. తాజాగా వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం నీఛమని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆయన విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తూ నీచపు ప్రచారం చేస్తున్నారని ఎల్లో మీడియాపై పేర్ని నాని విరుచుకుపడ్డారు.
రాజకీయంగా, వ్యక్తిగతంగా బురద చల్లే యత్నం
రాజకీయంగా, వ్యక్తిగతంగా క్యారెక్టర్ పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. పదవుల కోసం, చంద్రబాబు దగ్గర గుర్తింపు కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ ప్రశ్నించారు. అదేనా జర్నలిజమ్.. పత్రికా స్వేచ్ఛ అంటే? అంటూ పేర్ని నాని నిలదీశారు. మీడియా ముసుగులో కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

ఎవరైనా సరే ఆధారాలు లేని వార్తలు వేస్తారా
విజయసాయిరెడ్డి గానీ, చంద్రబాబు గానీ, పేర్ని నాని గానీ.. ఎవరైనా సరే.. ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శ ఆధారాలు లేనిదైనప్పుడు, హుందాగా ప్రచురించకపోవడం, ప్రసారం చేయకపోవడం మీడియాలో జరగడం లేదని ఆయన ఆక్షేపించారు.
సాయిరెడ్డి వివరణ కూడా అడగరా
ఇటీవలి కాలంలో మీడియా అంతా రాజకీయ రంగులు పులుముకుని ఉందని, అందుకే ఒక వార్తను ప్రచురించినా ఫలానా వ్యక్తి ఆరోపించారు అని చెప్పాలి.. కానీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి గురించి ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే కనీసం ఆయన వివరణ కూడా తీసుకోకుండా, మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యకుండా మీడియాలో రచ్చ చేయటం దారుణం అన్నారు.

పూర్తిగా దిగజారిన మీడియా
ఛానల్‌ను హుందాగా నడపాల్సింది పోయి నిరాధారంగా వ్యక్తిత్వ హననం చేస్తూ.. మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం చేయడం అత్యంత హేయమని, పూర్తిగా దిగాజారిపోవటమే అని ఆయన అభివర్ణించారు.అటు రాజకీయంగా చంపటానికి దుష్ప్రచారాలు, ఇటు మనిషిని మానసికంగా కూడా పతనం చేయడం కోసం ఈరకమైన పైశాచికం ప్రదర్శించడం, డిబేట్ పెట్టడం ఏ మాత్రం సరికాదని పేర్ని నాని తేల్చి చెప్పారు.
సాయిరెడ్డికి పేర్ని నాని మద్దతు
ఇంకా దానికి కొనసాగింపుగా పార్టీ మహిళా కార్యకర్తలతో అదేపనిగా టీవీలో తిట్టించడం అత్యంత హేయమన్న ఆయన, ఇది దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. మీడియా పేరుతో, మీడియా ముసుగులో ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్న వారిని ఉపెక్షిస్తున్నామని, వదిలేస్తున్నామని పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు తన పార్టీలోని వారే తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్న సాయిరెడ్డికి పార్టీ నుండి మాజీ మంత్రి పేర్ని నాని మద్దతు ఇచ్చారు.












Click it and Unblock the Notifications