Chandrababu : సుప్రీంకెళ్లినా బెయిల్ వద్దన్న చంద్రబాబు ! క్వాష్ కే మొగ్గు వెనుక ?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీఐడీ మాజీ సీఎం చంద్రబాబును మూడు వారాల క్రితం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో రిమాండ్ కు పంపింది. అయితే అప్పటి నుంచీ చంద్రబాబు బెయిల్ తీసుకోకుండా ఈ కేసే కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిచారు. అక్కడ కూడా బెయిల్ లభించే అవకాశం ఉన్నా క్వాష్ పిటిషన్ విచారణకే మొగ్గు చూపారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బెయిల్ తీసుకోకుండా క్వాష్ పిటిషన్లవైపే చంద్రబాబు మొగ్గు చూపుతుంటడంతో రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదల నానాటికీ ఆలస్యమవుతోంది. ముఖ్యంగా ఏసీబీ కోర్టు ఆయన్ను రిమాండ్ కు పంపగానే బెయిల్ కోరితే ఏ37గా ఉన్న ఆయన విడుదలయ్యే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పలువురు న్యాయనిపుణులు, సీబీఐ మాజీ డైరెక్టర్ సైతం అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ అవినీతి కేసులో బెయిల్ తీసుకునేందుకు మొగ్గు చూపలేదు. కానీ బెయిల్ కోరకపోవడంతో విమర్శలు రావడంతో ఏమనుకున్నారో ఏమో ఏసీబీ కోర్టులో ఆలస్యంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఉన్నత న్యాయస్ధానాల్లో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ పై కానీ కస్టడీపై కానీ ఏసీబీ కోర్టు తగిన నిర్ణయం తీసుకోలేకపోతోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత రిమాండ్ విధించగానే బెయిల్ కోరేందుకు అవకాశం ఉంది. అయినా చంద్రబాబు వినియోగించుకోలేదు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు. కానీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు దాన్ని కొట్టేస్తే తిరిగి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తీసుకునే అవకాశం ఉన్నా లేక హైకోర్టులోనే బెయిల్ కోరే అవకాశం ఉన్నా మొగ్గు చూపలేదు. చివరికి సుప్రీంకోర్టులోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న చంద్రబాబుకు అసలేం కావాలంటూ సీజే జస్టిస్ చంద్రచూడ్ కూడా ప్రశ్నించారు. దానికి కూడా లాయర్ లూథ్రా నేరుగా స్పందించకపోవడంతో సీజే.. బెయిల్ కావాలా అంటూ అడిగారు. దానికీ కూడా వద్దని లూథ్రా సమాధానం ఇచ్చారు.
తద్వారా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైనా వద్దని క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు ప్రకటించమనే చంద్రబాబు కోరారు. దీంతో స్కిల్ స్కాంలో బెయిల్ తీసుకుని విమర్శలు కొనసాగేలా చేయడం కంటే నిర్దోషిగా బయటపడటమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నింటి కంటే మించి స్కిల్ స్కాంలో తాను తప్పు చేయలేదని బాబు బలంగా భావిస్తున్నారని, అందుకే బెయిల్ కోరడం లేదని, కేసే కొట్టేయాలని కోరుతున్నారని, ఈ విచారణ జరిగే వరకూ జైల్లో ఉండేందుకూ మొగ్గు చూపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications