ఏపీలో అప్రకటిత విద్యుత్ కోతలు: విలవిలలాడుతున్న ప్రజలు, ఆస్పత్రులలో నరకం చూస్తున్న రోగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా ఎండలు పెరిగిన వేళ అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎండ వేడిమి మధ్య, షెడ్యూల్ లేని అప్రకటిత కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుండి పట్టణాలు, నగరాల వరకు డిస్కమ్‌లు రాష్ట్రంలో 6 నుంచి 9 గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నట్లు సమాచారం. ప్రతి రోజూ ఆరు గంటల నుండి తొమ్మిది గంటల పాటు కొనసాగుతున్న విద్యుత్ కోతలతో ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఇక ఆసుపత్రులలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

విద్యుత్ కోతలతో ఆస్పత్రుల్లో రోగుల నరకం
విద్యుత్ కోతలతో ఆసుపత్రిలో రోగుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. పది రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఆసుపత్రుల్లో వైద్యులు సైతం కరెంటు కోతల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చీకట్లోనే ఒక్కోసారి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆపరేషన్లు చెయ్యాలంటే కరెంట్ కోతలతో వైద్యులు సైతం ఇబ్బంది పడుతున్నారు. అసలే అనారోగ్యం, ఆపై పవర్ కట్స్ తో రోగులు నరకాన్ని చవి చూస్తున్నారు.

పరీక్షల సమయంలో కరెంట్ కోతలతో విద్యార్థులకు పెద్ద పరీక్ష
అంతేకాదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ విద్యార్థులు తుది పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో, పరీక్షలకు ముందు విద్యార్థులు కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. చీకట్లో లాంతర్ల వెలుగులో పరీక్షలకు ప్రిపేర్ కావలసి వస్తుంది. గ్రామాల లోనే కాదు ప్రధాన పట్టణాల్లోనూ, నగరాలలోనూ విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు ఒకే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలను విధిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు.

కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న రైతులు .. సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనలు
ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రజలు సరిగా నిద్ర కూడా పోలేని పరిస్థితి నెలకొంది. ఇక అధికారులు చెబుతున్న సమయం కంటే, ఎక్కువ సమయం విద్యుత్ కోతలు విధిస్తూ ఉండడం గమనార్హం. విద్యుత్ కోతల వల్ల రాష్ట్ర రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పంటలు కరెంట్ కోతల నేపధ్యంలో నీళ్ళు సరిగ్గా లేక ఎండిపోతున్నాయి. ఇక ఈ క్రమంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఇప్పటికే అనేకమార్లు అనేక సబ్ స్టేషన్ల వద్ద రైతులు ఆందోళనలు తెలియజేశారు. చిరు వ్యాపారులు సైతం తమ వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు..

విద్యుత్ కోతలపై ప్రజాగ్రహం .. కరెంట్ కోతలు ఆపాలని డిమాండ్
ఇక విద్యుత్ కోతలపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. కాల్ చేసి ఫిర్యాదులు చేస్తున్నవారు కొందరైతే, కరెంట్ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తున్న వారు మరికొందరు. మొత్తంగా అందరూ ఎన్ని గంటల పాటు విద్యుత్ కోత విధిస్తారు అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు జగన్ సర్కార్ పై కరెంట్ కోతల నేపధ్యంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. విద్యుత్ కోతలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యుత్ డిమాండ్ ఎక్కువ కావటం , కొరత ఉండటం .. కరెంట్ కోతలకు కారణం
సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం అధిక పగటి ఉష్ణోగ్రత కారణంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు ఏసీ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక రైతులు పంట పొలాలను కాపాడుకునే క్రమంలో అధిక మొత్తంలో మోటార్లను వినియోగిస్తున్నారు. రైతులు కూడా ఎక్కువ కరెంటు ను వినియోగిస్తున్న క్రమంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే డిమాండ్ కు తగినంతగా విద్యుత్తు ఉత్పత్తి లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలకు దిగుతోందని సమాచారం.












Click it and Unblock the Notifications