నియోజకవర్గంలో 'తొడగొడుతున్న' విభేదాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతంగా ముగించారు. అన్నిచోట్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో బాబు ఉబ్బితబ్బిబ్బయ్యారు. బొబ్బిలి, రాజాం తదితర నియోజకవర్గాల్లో ఇంతటి స్పందనను తాను ఊహించలేదన్నారు. బాబు తన పర్యటన ముగించిన తర్వాత కూడా రాజాంలోని రెండు గ్రూపుల మధ్య విభేదాలు చల్లారలేదు.

రాజాంలో ముదురుతున్న విభేదాలు
రాజాంలో అంతర్గత విభేదాలు తగ్గడంలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళి, టీడీపీ నేత, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి వర్గాల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. చంద్రబాబు తన జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనల్లో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. కానీ రాజాం పర్యటనలో మాత్రం అభ్యర్థి ఎవరనేది తేల్చకుండా పెండింగ్ లో పెట్టారు. చంద్రబాబు పర్యటన ఆసాంతం రాజాం ఇన్ఛార్జి కొండ్రు మురళి ఉన్నారు. ఇది నచ్చని ప్రతిభా భారతి కార్యక్రమం మధ్య నుంచే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న గ్రీష్మ
2019 ఎన్నికల్లో కొండ్రు మురళి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అధిష్టానానికి టచ్ లో లేరు. మళ్లీ పార్టీ బలపడుతుండటంతో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ రాజాం సీటును ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె ఫైర్ బ్రాండ్ నేతగా పేరుతెచ్చుకున్నారు. ఒంగోలు మహానాడులో బహిరంగంగా తొడకొట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరి అందరి దృష్టిని ఆకర్షించారు. సీటు విషయమై నారా లోకేష్ తో మాట్లాడానని, అందరం కలిసి పనిచేసుకుందామన్నారని గ్రీష్మ చెబుతున్నారు.

నాన్చితే నష్టపోయేది పార్టీయే
చంద్రబాబు ఏ విషయం తేల్చకుండా పెండింగ్ లో పెట్టడంతో రాజాం సీటు కొండ్రు మురళికే అని ప్రచారం మొదలైంది. వాస్తవానికి చంద్రబాబు కూడా కొండ్రువైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రతిభా భారతి చంద్రబాబు చెప్పడంతో ఆయన మాటకు గౌరవం ఇచ్చి కొండ్రు కోసం పనిచేశారు. కానీ ఈసారి గ్రీష్మ మాత్రం ససేమిరా అంటోంది. సీటు మాత్రం తనకివ్వాల్సిందే అని లోకేష్ దగ్గర పట్టుబడుతున్నారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని చంద్రబాబే చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో ఏమీ తేల్చకుండా నానిస్తే చివరకు పార్టీయే నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే అభ్యర్థిని ఖరారు చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications