జగన్ ఇలాకాలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. వారికి ఇళ్ళ పట్టాలు!
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్ ఇలాకా పైన ఫోకస్ చేస్తుంది.పులివెందులలో ప్రజల సమస్యలను పరిష్కరించటంపైన దృష్టి సారిస్తోంది. పులివెందుల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పేదలు తమ ఇళ్లపై యాజమాన్య హక్కులు లేకుండా బాధపడుతున్న వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యింది. డీకేటీ భూములు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నా పట్టా లేకపోవడంతో చాలా కాలంగా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జయమ్మ కాలనీ, రాజారెడ్డి కాలనీల్లో ఉన్నవారితో కలిపి సుమారు నాలుగు వేల కుటుంబాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి కలను నెరవేర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 30న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా ఈ కాలనీలకు సంబంధించిన లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించాలని అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు.

టీడీపీ నేత బీటెక్ రవి ఆధ్వర్యంలో స్థానిక అధికారులు ఈ పట్టాల పంపిణీ విషయంలో సమావేశమయ్యారు. డీకేటీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇళ్ళు ఉన్నా డాక్యుమెంట్స్ లో పేరు లేని వారికి కూడా అవకాశం కల్పించనున్నారు. నీటి పన్ను రసీదులు, కరెంట్ బిల్లులు వంటి ఆధారాలు ఉంటే వాటి ఆధారంగా అర్హులకు పట్టాలు జారీ చేయనున్నారు.
ఇలా శాశ్వత యాజమాన్య హక్కు వస్తే కుటుంబాలకు చాలా మేలు జరుగుతుంది. బ్యాంకుల నుంచి వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలు సులభంగా తీసుకోవచ్చు. పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు కూడా పొందే వీలు కలుగుతుంది.ఇది ఆ నాలుగు వేల కుటుంబాలకు కాస్త భరోసా ఇస్తుంది.
ఈ క్రమంలో వీరికి సెప్టెంబర్ 30 నాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి హక్కు పత్రాలు అందించాలని అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. పేదలకు తమ ఇంటి మీద పూర్తి హక్కు వస్తే వారికి అన్ని విధాలా లబ్ది జరుగుతుంది.













Click it and Unblock the Notifications
