టూరిస్ట్ బాబూ- వీకెండ్ బాబూ- మాకిదేం ఖర్మరా బాబూ- చంద్రబాబు, పవన్ పై రోజా సెటైర్లు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ చేస్తున్న యాత్రలపై మంత్రి రోజా ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. 30 ఏళ్ళ తర్వాత చివరి ఛాన్స్ అంటుంటే.. ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టినా మళ్ళీ ఇదేం ఖర్మరా బాబూ అని అడిగారు. టూరిస్ట్ బాబు.. వీకెండ్ బాబులను 2024లో మరోసారి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను పుట్టిన చిత్తూరు జిల్లాకు, రాయలసీమకు ఏ మేలూ చేయని సీమ ద్రోహి బాబు అని రోజా విమర్శించారు. కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలన్న బుద్ధి, జ్ఞానం బాబుకు ఎందుకు కలగలేదని ఆమె ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ లను ఓడించి, హైదరాబాద్ తరిమేసినా.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు టూరిస్టుల్లా వస్తున్నారు 'ఇదేం ఖర్మరా.. బాబూ' అని ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నారని పర్యాటక మంత్రి రోజా విమర్శించారు. తన పాలనను చూసి ఓటెయ్యండని చెప్పే దమ్ము, ధైర్యం లేని చంద్రబాబు, తన భార్యను అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డ్రామాలు ఆడి, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చినా సింపతీ రాలేదన్నారు. దాంతో బాదుడు అంటూ పర్యటనలు చేస్తే.. తనపై రాళ్లు వేశారంటూ మరో డ్రామా ఆడాడన్నారు. అది కూడా సక్సెస్ కాలేదన్నారు. చివరకు తనకు ఇదే చివరి అవకాశం అని, ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు చంద్రబాబు అడుగుతున్నాడన్నారు.

1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత మళ్లీ చివరి ఛాన్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అని అంటుంటే.. రాష్ట్ర ప్రజలు ఇదేమి ఖర్మరా బాబు..అని అంటున్నారని రోజా విమర్శించారు. ఎన్టీఆర్ తన జీవితంలో, తన జీవిత చరమాంకంలో ఏమనుకున్నాడు. ఇదేం ఖర్మరా చంద్రబాబూ అనే కదా..? అని రోజా గుర్తుచేశారు. తన కుప్పంలో శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం చూపించలేని చంద్రబాబు, ఈ రాష్ట్రంలో తాను ప్రారంభించి, తానే పూర్తి చేసిన ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే దానర్థం ఇదేం ఖర్మరా బాబు అనే కదా..అన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే స్కీము ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే.. దాని అర్థం ఏమిటి, ఇదేం ఖర్మరా బాబు అనే కదా అన్నారు. 44 ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు, రైతులకు చేసిన న్యాయం గానీ, మంచిగానీ ఒక్కటి కూడా గుర్తుకు వచ్చే పరిస్థితి లేదంటే... దాని అర్థం ఏమిటి.. ఇదేం ఖర్మరా బాబు అనే కదా..? అని రోజా విమర్శించారు.
చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, దగా, మోసం, వంచన గుర్తుకొస్తున్నప్పుడు, ప్రజలంతా అదే చంద్రబాబును, ఈరోజు మళ్ళీ చూడాల్సి వస్తుంటే, అదికూడా ఒక టూరిస్టు బాబును, ఒక వీకెండ్ బాబును చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు..ఇదేం ఖర్మరా బాబు అనే కదా..? అని రోజా అన్నారు. టీడీపీకి 23 సీట్లు కూడా ఇవ్వడం తప్పైపోయిందని ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారని రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిని పూర్తిగా తరిమి కొట్టాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని మోసం చేసి, డ్వాక్రా సంఘాలన్నింటినీ దెబ్బతీసిన చంద్రబాబు చూసి, మళ్ళీ ఇదేం ఖర్మరా బాబు అనే కదా..? అనుకుంటున్నారని అన్నారు. సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరుకుగానీ, సొంత ప్రాంతం రాయలసీమకుగానీ, ఏనాడూ మేలు చేయలేదని అక్కడి ప్రజలు 2014లో కూడా తిరస్కరించిన మాట నిజమే కదా.. కాబట్టి, రాయలసీమ అంతా ఇదేం ఖర్మరా బాబు అని అనుకుంటున్నారన్నారు.
ఇక సామాజిక వర్గాలపరంగా చూస్తే.. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు.. బీసీలను మోసం చేశాడు. ఎస్సీలనూ మోసం చేశాడు. ఎస్టీలను దగా చేశాడు. మైనార్టీలకు భవిష్యత్తే ఉండకూడదనుకున్నాడని రోజా విమర్శించారు. మరి ఇలాంటి బాబుని సామాజికవర్గాలన్నీ ఇదేం ఖర్మరా బాబు.. అనుకున్నాయే తప్ప, అది గొప్ప పరిపాలన అని ఎవరన్నా అనుకున్నారా..? అని రోజా ప్రశ్నించారు. మరి పార్టీ వ్యవస్థాపకుడికే నచ్చని, పార్టీ వ్యవస్థాపకుడికే ద్రోహం చేసిన, అధికారం వచ్చినప్పుడల్లా మోసం చేసిన చంద్రబాబు ఈరోజు బయటకు వచ్చి, 30 ఏళ్ళల్లో తనవల్ల కానిది, 3 ఏళ్ళలో జగన్ గారి పాలనలో సాకారం అవుతుంటే ఇదేం ఖర్మరా అని తనకుతానే అనుకుంటుంటే బాబు గొప్పవాడని ఎవరైనా భావిస్తారా అని అడిగారు.
కర్నూలు వెళ్ళి న్యాయ రాజధానికి వ్యతిరేకం కాదని అంటాడని, మరి రాష్ట్రం విడిపోయినప్పుడైనా, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అయినా రాయలసీమ ప్రజల మనోభావాలను గౌరవించి, వారికి న్యాయం చేసేలా న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే బుద్ధి, జ్ఞానం ఎందుకు చంద్రబాబుకు కలగలేదు అని రోజా సూటిగా ప్రశ్నించారు.
జగన్ కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని హామీ ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం వికేంద్రీకరణ బిల్లు పెడితే.. దాన్ని వ్యతిరేకించింది మీరు కాదా అని అడిగారు. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా, బాదుడు అని, ఖర్మ అని.. పర్యటనలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications