జగన్ అరెస్టుపై కూటమి రూటు మార్చిందా ? సిట్ దర్యాప్తు తేలిపోతున్న వేళ..!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కాంలో ఓవైపు ఆధారాల వెతుకులాటలో సిట్ బిజీగా కనిపిస్తున్న వేళ జగన్ అరెస్టు ప్రచారాన్ని కూటమి నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అసలేం జరుగుతుందన్న చర్చ సాధారణ ప్రజల్లో సైతం కనిపిస్తోంది.
మద్యం స్కాంలో ఇప్పటివరకూ సిట్ అరెస్టు చేసిన ఏకైక ప్రజా ప్రతినిధి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డితో పాటు, ఆయన సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి, భార్య భారతి సిమెంట్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప వంటి వారు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని నిందితులుగా విచారణకు పిలిపించినా అరెస్టు చేయలేదు. అలాగే విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిపించినా ఆ తర్వాత నిందితుడిగా చేర్చారు. చివరిగా జగన్ ను తొలి ఛార్జిషీట్ లో జస్ట్ ప్రస్తావించి వదిలేశారు.

ఇలా జగన్ పేరును ఛార్జిషీట్ లో నామమాత్రంగా ప్రస్తావించడం, నిందితుడిగా ఇప్పటివరకూ చేర్చకపోవడం, అయినా నేరుగా అరెస్ట్ అంటూ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడాన్ని చూస్తుంటే ఇదంతా కేవలం మైండ్ గేమ్ అని ఎవరికైనా అర్దమవుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే అంశం కూటమికి చికాకుగా మారినట్లు తెలుస్తోంది. అంఇదుకే వ్యూహాత్మకంగా మద్యం స్కాం తీవ్రత సడలిపోకుండా ఉండేందుకు, సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ అరెస్టు ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వాదనకు మద్దతుగా మరికొన్ని అంశాల్ని కూడా వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటివరకూ జగన్ అరెస్టుపై మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ వంటి వారు కూడా కచ్చితంగా అవుననో, కాదనో చెప్పలేక చట్టం తన పని చేసుకుపోతుందంటూ చెప్పేస్తున్నారు. కింది స్దాయి క్యాడర్ మాత్రం జగన్ అరెస్టు కావడం ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఆధారాలు లభించాక సిట్ బిగ్ బాస్ జగన్ ను కూడా అరెస్టు చేస్తుందనే చెప్పారు. అంటే ఇంకా సిట్ కు ఆధారాలు లభించలేదని దీని అర్దమన్నమాట. మొత్తం మీద సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే కూటమి నేతలు జగన్ అరెస్టు ప్రచారం తెరపైకి తెస్తున్నట్లు అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications