ఎమ్మెల్యేగా బరిలోకి సజ్జల తనయుడు..!?
వచ్చే ఎన్నికల్లో సజ్జల తనయుడు బరిలో నిలించేందుకు సిద్దం అవుతున్నారు.
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్ధుల ఖరారుపైన కసరత్తు ప్రారంభించాయి. వైసీపీ వై నాట్175 నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్ష టీడీపీ జనసేనతో పొత్తుతో గెలుపు తమదేననే ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీ తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సీఎం జగన్ ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ సీట్లలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసారు. మరి కొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం సొంత జిల్లా కడపలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కడపలో వైసీపీకి ఉన్న పట్టుతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇటు ప్రభుత్వం..అటు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి సీఎం జగన్ తాజాగా కీలక బాధ్యతలు అప్పగించారు. సోషల్ సోషల్ మీడియా పర్యవేక్షణ చేస్తున్నారు. భార్గవ్ కు సంబంధించి కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సజ్జల భార్గవ్ కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయం పైన కడప జిల్లా వైసీపీలోనూ చర్చ సాగుతోంది. ఇందు కోసం రెండు సీట్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ ప్రచార సారాంశం. కడప జిల్లా రాజంపేటతో పాటుగా మరో కీలక లోక్ సభ నియోజకవర్గం పైన ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. రాజంపేట నుంచి ప్రస్తుతం మేడా మల్లిఖార్జున రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పోటీ గురించి అనేక రకాల ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా భార్గవ్ రెడ్డి పేరు రేసులో ఉన్నట్లుగా చర్చ వినిపిస్తోంది.

సజ్జల తొలి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. జగన్ సీఎం అయిన తరువాత ఆయన పాత్ర మరింత కీలకంగా మారింది. ఇప్పుడు ఆయన తనయుడు భార్గవ్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సజ్జల ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొంత కాలం క్రితం వరకూ ఎంపీ విజయ సాయిరెడ్డి వైసీపీ సోషల్ మీడియా విభాగం పర్యవేక్షించారు. కానీ, వైసీపీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. ప్రచారం లో కీలక పాత్ర పోషించే సోషల్ మీడియా బాధ్యతలను సీఎం జగన్ భార్గవ్ కు అప్పగించారు. ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతల ద్వారా పార్టీ విజయానికి పని చేయాల్సిన భార్గవ్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది. కానీ, ఇప్పటికే సజ్జల తనయుడు పోటీ ఖాయమంటూ ప్రచారం మాత్రం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications