చంద్రబాబు తెలంగాణకే అనుకూలం, అందుకే నోరెత్తరు: సజ్జల రామకృష్ణారెడ్డి, జలాలపై సుప్రీంకు
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ జల అక్రమాలపై మాట్లాడని చంద్రబాబు.. అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?
మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఆయన ఉన్నారని అన్నారు. అసలు తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని సజ్జల ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారా? అనే అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పంచాయతీల గొంతు నొక్కింది చంద్రబాబేనని, ఆయన హయాంలోనే జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ పంచాయతీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు..
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారని సజ్జల ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయించారని, పుట్టిన ప్రాంతం, రాష్ట్రంపై చంద్రబాబుకు ప్రేమలేదని మండిపడ్డారు.
పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌పై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అధికారంపై యావే తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు. ఆర్థిక శాఖ ఖర్చులను తాము ఎక్కడా దాయడం లేదని.. చంద్రబాబు చేసిన తప్పులవల్లే రుణపరిమితిలో కేంద్రం కోత విధించిందని సజ్జల వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఆర్థిక కష్టాలున్నా.. చాలా ఓపిగ్గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పారు.

కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న సజ్జల..
కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం వాటిల్లుతుందని ఆందోలన వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగరాదనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సజ్జల తెలిపారు. రెండు రాస్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని అంటున్నారని.. అయితే, తెలంగాణ నుంచి ఎవరైనా ముందుకు రావాలి కదా అని సజ్జల వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications