మొన్న తిరుమలపై హెలికాప్టర్ చక్కర్లు- ఇప్పుడు? ఉద్రిక్తత
Tirupati: దేశంలో పౌర విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు తీవ్రతరం అయ్యాయి. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి బెదిరింపులు అందుతోన్నాయి. రెండు వారాల వ్యవధిలో వందలాది విమానాలకు బెదిరింపు ఇ-మెయిల్స్ అందాయి. ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయి.
గురువారం కూడా ఒకేరోజు 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు అందాయి. 20కి చొప్పున ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 13 విమానాలకు ఇలాంటి ఇమెయిల్స్ అందాయి. ఈ బెదిరింపుల వల్ల ఈ ఒక్క వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 200లకు విమానాల రాకపోకలు ప్రభావితం అయ్యాయి.

అలాంటి బెదిరింపులే తాజాగా తిరుపతికీ అందడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఉద్రిక్తతలకు దారి తీసింది. తిరుపతిలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న పలు హోటళ్లకు గురువారం రాత్రి బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందడం కలకలం రేపింది. ఈ విషయాన్ని తిరుపతి జిల్లా పోలీసులు ధృవీకరించారు. ఒకే సమయంలో అవి అందినట్లు వెల్లడించారు.
పై వైస్రాయ్, రిగాలియా, రాజ్ పార్క్, రినెస్ట్ హోటల్స్‌కు ఈ మెయిల్స్ అందాయి. దీనిపై ఆయా హోటళ్ల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలించారు. హోటల్ గదులను క్షున్నంగా పరిశీలించారు.
ఎలాంటి బాంబులు గానీ పేలుడు వస్తువులు, అనుమానాస్పద పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం నిర్ధారణ కావట్లేదు. ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవట్లేదని, ఇమెయిల్స్‌ను పంపించిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తోన్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదలాయించారు.
ఇటీవలే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. నో ఫ్లయింగ్ జోన్ అయినప్పటికీ- తిరుమల మీదుగా ఈ హెలికాప్టర్ వెళ్లింది. అంతకుముందు కూడా విమానం నుంచి తీసిన కొన్ని తిరుమల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పుడు తాజాగా తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపులు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమలకు ఎలాంటి భద్రత ఉండట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తెలుగుదేశం పార్టీకే చెందిన లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ తిరుమలలో నో ఫ్లైయింగ్ జోన్ ఉల్లంఘన చోటు చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications