తండ్రి అక్రమసంబంధం.. పక్కింట్లో తొమ్మిదేళ్ళ తులసి మృతదేహం!
మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను అత్యంత కర్కశంగా తండ్రి హతమార్చిన ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. త్రిపురాంతకం నివాసి అయిన ఎం శివారెడ్డి, ఆయన భార్య ఈశ్వరమ్మ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె అయిన తులసికి 9 సంవత్సరాలు. అయితే ఊహించని విధంగా తులసిని శివారెడ్డి హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.
నోట్లో గుడ్డలు కుక్కి, బలంగా కొట్టి కూతుర్ని చంపిన తండ్రి
పక్కింట్లో అత్యంత పాశవికంగా తులసి నోట్లో గుడ్డలు కుక్కి ముఖం, గొంతు పైన బలంగా కొట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. తులసిని అత్యంత పాశవికంగా చంపడం వెనుక తండ్రి వివాహేతర సంబంధం కారణమని పోలీసులు గుర్తించారు. ఈనెల 25వ తేదీ రాత్రి శివారెడ్డి దంపతులు డాబా పైన పడుకున్నారు. తులసి తన తాత అయిన సుందరయ్య పక్కన పడుకుంది.

పక్కింటి మహిళతో అక్రమ సంబంధం.. కూతురి హత్య
తెల్లవారుజామున సుందరయ్య బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి మంచం మీద తులసి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఇల్లంతా వెతికిన తులసి జాడ దొరకక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దర్యాప్తులో బాలిక తండ్రి శివారెడ్డికి పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానంతో తాళం పగలగొట్టి చూశారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లోపల తులసి విగతజీవిగా పడి ఉంది. ఆమెపైన అత్యంత అమానుషంగా దాడి చేసినట్టు నోట్లో గుడ్డలు కుక్కినట్టు కనిపిస్తోంది. ఒంగోలుకు చెందిన క్లూస్ టీం, గుంటూరు ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరించి తులసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తెను తన భర్త శివారెడ్డి, పక్కింట్లో ఉండే మహిళ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని హత్య చేశాడని తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారికి అడ్డుగా ఉందని చిన్నారి హత్య
తండ్రి శివారెడ్డి తో పాటు, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కూడా పోలీసులు అరెస్టు చేసి ఎందుకు వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనేది విచారణ జరుపుతున్నారు. అయితే తండ్రి వివాహేతర సంబంధం గురించి తులసికి తెలుసని, ఈ క్రమంలో వారి వివాహేతర సంబంధానికి తులసి అడ్డుగా ఉందని భావించి తులసిని హత్య చేసినట్టు భావిస్తున్నారు.
మానవ సంబంధాలను ప్రశ్నిస్తున్న అమానుష ఘటనలు
అయితే ఆ రోజు ఏం జరిగింది. తులసి అక్కడికి ఎందుకు వెళ్ళింది.. అంత పాశవికంగా తులసిని చంపడానికి గల కారణాలు ఏమిటి అన్నది పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కంటికి రెప్పలా బిడ్డను కాపాడవలసిన తండ్రి ఇంత దారుణంగా బిడ్డ ప్రాణాలు తీయడం స్థానికులను ఆవేదనకు గురిచేస్తుంది. మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications