ఏపీలో 135 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు.. రోగుల అభిప్రాయాలతో షాక్!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు సరిగా అందకపోవడంపై అధికారులు కఠినంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 135 మంది వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ ఆర్. వెంకటరమణ ఈ వివరాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు నివేదించారు.జూలై నుంచి నవంబరు 7 వరకు ఐవీఆర్ఎస్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ మూల్యాంకనం చేశారు.
ఫోన్ కాల్స్ ద్వారా రోగులు వైద్యుల అందుబాటు, మందులు లభ్యత, పారిశుద్ధ్యం, సేవల కోసం డబ్బు అడగడం లాంటి అంశాలపై తమ అనుభవాలు చెప్పారు. అక్టోబర్ నెలలో నాలుగు ప్రధాన పారామీటర్లపై ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏ ఒక్క అంశంలోనైనా 100 శాతం నెగటివ్ రిస్పాన్స్ వచ్చిన వైద్యాధికారులకు ఈ నోటీసులు ఇచ్చారు.ఈ సర్వేలో పల్నాడు జిల్లా 81.6 శాతం రోగుల సంతృప్తిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

పోలవరం 81.5 శాతం, నెల్లూరు 80.7 శాతం, తిరుపతి 78.3 శాతం, కృష్ణా 77.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే కర్నూలు 69.5 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. అనంతపురం 69.8 శాతం, ఎన్టీఆర్ జిల్లా 70.9 శాతం, అనకాపల్లి 71.5 శాతం, మర్కాపురం 71.8 శాతంతో వెనుకబడిన జిల్లాల్లో ఉన్నాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఐవీఆర్ఎస్ రిపోర్టుల ద్వారా ఆసుపత్రుల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సమీక్షా సమావేశాల్లో జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. గతంలో కూడా అనధికారికంగా గైర్హాజరైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పనితీరు ఆధారంగా మరింత జవాబుదారీతనం తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
పల్నాడు,అనంతపురం జిల్లాలోని కుదేరు, తరిమెల, శ్రీరంగపురం, కంబదూరు, గార్లదిన్నె పీహెచ్సీలు సర్వేలో మెరుగైన పనితీరు చూపి టాప్ జాబితాలో నిలిచాయి. తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని కేంద్రాలు కూడా మంచి ర్యాంకులు సాధించాయి. వెనుకబడిన కేంద్రాల్లో అనంతపురం, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని పీహెచ్సీలు ఉన్నాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేద, మధ్యతరగతి ప్రజలకు సమీపంలో వైద్య సేవలు అందించే ముఖ్య కేంద్రాలు. ఇక్కడ వైద్యులు సకాలంలో హాజరుకాకపోవడం, మందులు లభ్యం కాకపోవడం, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి చర్యలు మొదలు పెట్టింది. నోటీసులు అందుకున్న వైద్యాధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే మరిన్ని క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
