త్వరలో ఏపీలో ఊహించని సీన్లు-సోము వీర్రాజు హాట్ కామెంట్స్-హైకమాండ్ కీలక నిర్ణయం
ఏపీ రాజకీయాల్లో త్వరలో ఎవరూ ఊహించని సీన్లు చోటుచేసుకోబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సినిమా సీన్లను మించి ఉండబోతున్నాయన్నారు. ఏపీలో ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు మారబోతున్నట్లు సోము ప్రకటించారు. దీంతో సోము వీర్రాజు చేసిన హాట్ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది.
ఏపీ విషయంలో బీజేపీ అధిష్టానం అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలతో అందరూ ఆశ్చర్యపోవడం ఖాయమన్నారు. ఈ రాజకీయ పరిణామాలు ఎలా జరిగియోననే విషయం కూడా ఎవరికీ అర్థం కాదన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీని గద్దె దించేది బీజేపీయేనని సోము వీర్రాజు తెలిపారు. ఎవరికీ భయపడని జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం భయపడతారని సోము వీర్రాజు మరో బాంబుపేల్చారు.

అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమైతే బీజేపీ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. వైఎస్సార్సీపీని వణికించిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయేనని వెల్లడించారు. ఏపీలో విగ్రహాలను రథాలను ధ్వంసం చేస్తే బీజేపీయే పోరాటం చేసిందని తెలిపారు. రామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు తాము యాత్ర చేస్తామంటేనే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని సోము వీర్రాజు గుర్తు చేశారు. త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో రాయలసీమ యాత్ర కూడా చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామని సోము వీర్రాజు తెలిపారు. నిర్వాసితులు పోలవరంలో కాదని.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వాసితులు ఉన్నారని చెప్పారు.
ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనని సోము వీర్రాజు తెలిపారు. ఈ విషయంలో దమ్ముంటే చర్చకు రావాలని జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకుండా సీఎం జగన్ ఆపేశారని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రంగంలోకి దిగగానే రెండో కోటా ఇచ్చారని మండిపడ్డారు. కాగా సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం, ఏపీలోనూ సినిమా సీన్లను మించిన సీన్లు జరుగుతాయని సోము వీర్రాజు హింట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోందంటున్నారు. బీజేపీ-జనసేన కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటిస్తారేమోనని చర్చ సాగుతోంది. లేదా ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానిస్తారా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications