తిరుమలలో కీలక ఘట్టం
Srivari Brahmotsavams 2024: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 66,986 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,163 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 5.05 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కిటకిటలాడాయి. ట్రావెలర్స్ బంగళా వరకూ క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు శుద్ధి కార్యక్రమం ఆరంభమైంది. ఉదయం 10 గంటలకు వరకు కొనసాగింది.
టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్ అధికారి శ్రీధర్, ఆలయ అర్చకులు ఇందులో పాల్గొన్నారు. ఆనందనిలయం, ధ్వజస్తంభం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.
ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.
అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
సంవత్సరంలో నాలుగుసార్లు అంటే- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అష్టదళ పాద పద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications