చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా - నేడే కీలకం, ఉత్కంఠ..!!
తెలుగు దేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)కు ఉపశమనం లభిస్తుందా. సుప్రీంకోర్టులో ఈ రోజు చంద్రబాబు కేసు విచారణకు రానుంది. దీంతో ఇప్పుడు సుప్రీం(Supreme Court)లో జరిగే విచారణ..నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అటు ఏసీబీ కోర్టు(ACB Court)లో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ తో పాటుగా చంద్రబాబు బెయిల్ అంశం పైన విచారణ జరగనుంది. సుప్రీంలో జరిగే పరిణామాలకు అనుగుణంగానే ఏసీబీ కోర్టులో విచారణ ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
కీలక పరిణామాలు: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసుల వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(supreme Court) బుధవారం విచారణ జరపనుంది.

అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిగణనలోకి తీసుకున్నారు. బుధవారం విచారించాలని నిర్ణయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీ భట్టిలతో కూడిన ధర్మాసనం దీనిని చేపట్టనుంది.
ధర్మాసనం విచారణ: ధర్మాసనం ఎదుట బాబు పిటిషన్ 61వ కేసుగా లిస్టయింది. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని, రిమాండ్ రిపోర్టులో ఎటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం కేసు నమోదుకు గవర్నర్(governor) అనుమతి తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇదే అంశం పైన ఏపీ హైకోర్టులో నూ విచారణ జరిగింది. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్(Quash Petition) ను కొట్టివేసారు. దీంతో, ప్రధానంగా మూడు అభ్యర్ధనలతో చంద్రబాబు సుప్రీంకోర్టు(Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసారు. అందులో మధ్యంతర బెయిల్ అంశం కూడా ఉంది. చంద్రబాబు ఈ నెల 10వ తేదీ నుంచి రిమాండ్ లో ఉన్నారు.
బెయిల్ పై విచారణ: దీంతో, సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా కోర్టు నుంచి వస్తాయా..చంద్రబాబుకు రిలీఫ్ దక్కుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు(Inner Ring Road Case) లో ఏపి హైకోర్టు లో ఇవ్వాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈ కేసులో ఏ14 గా లోకేశ్ పేరు చేర్చారు.
ఇటు ఏసీబీ కోర్టు(ACB Court)లో చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ పిటీషన్..అటు చంద్రబాబు బెయిల్ పైన ఈ రోజు విచారణ జరగనుంది. సుప్రీంలో ఈ రోజు తరువాత అక్టోబర్ 3వ తేదీ వరకు కోర్టుకు వరుస సెలవులు. దీంతో, ఈ రోజు సుప్రీంకోర్టు(Supreme Court) చంద్రబాబు కేసు విచారణ..నిర్ణయం ఏంటనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications