'జాతీయ' స్థాయిలో చంద్రబాబు ప్రణాళిక??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈసారి తన ఎన్నికల ప్రణాళికను పూర్తిగా మార్చివేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాన్ని, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో వ్యూహాన్నిరూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుగుతున్నాయి. రెండూ ఒకేసారి జరగడంవల్ల క్రాస్ ఓటింగ్ తో లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోతున్నామని చంద్రబాబు గుర్తించారు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
Recommended Video

జమిలివల్ల క్రాస్ ఓటింగ్ జరుగుతోంది!
ప్రతి ఎన్నికల్లోను క్రాస్ ఓటింగ్ జరుగుతుండటంతో ఈసారి ఎలాగైనా లోక్‌సభ స్థానాల్లో అత్యధికం సాధించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఎక్కువ లోక్‌సభ సభ్యులుండటంవల్ల జాతీయస్థాయి రాజకీయాల్లో గుర్తింపు లభిస్తుండటంతోపాటు అవసరమైతే ప్రభుత్వంలో ప్రాధాన్యత కూడా దక్కుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియనిదేమీ కాదు. రాష్ట్రంలో జమిలి ఎన్నికలవల్ల క్రాస్ ఓటింగ్ జరుగుతోంది. ఒక ఓటు అసెంబ్లీకి వేశాంకదా.. మరో ఓటు వేరే పార్టీకి లోక్‌సభకు వేద్దాంలే అనే ప్రజల ఆలోచనా విధానంవల్ల అసెంబ్లీకి లాభం కలుగుతున్నా లోక్‌సభకు టీడీపీకి నష్టం వాటిల్లుతోంది.

అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం!
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? సామాజికవర్గ పరంగా అభ్యర్థుల ఎంపిక ఉంటే విజయావకాశాలు ఎలా ఉంటాయి? పార్టీ గెలవాలంటే అక్కడ తీసుకోవాల్సిన చర్యలేంటి? క్రాస్ ఓటింగ్ జరగకుండా రెండు ఓట్లు టీడీపీకే పడేలా చేయాలంటే అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి సామాజిక తూకం పాటించాలి? తదితర అంశాలపై ఆయన సర్వే నిర్వహింపచేశారు.

ఎక్కువ లోక్ సభ సీట్లే లక్ష్యంగా..
ఆ సర్వే ఫలితాల ఆధారంగా ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉండబోతోందని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టీడీపీకి కంచుకోటలుగా ఉన్నవి, టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగేవి, వైసీపీకి కంచుకోటలుగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలను గుర్తించి వాటిని విడివిడిగా విభజించి వ్యూహాలు రూపొందిస్తున్నారు. జాతీయస్థాయిలో ఈసారి ఎక్కువ లోక్‌సభ నియోజకవర్గాలున్నవారికి ఎంత ప్రాధాన్యం దక్కబోతోందనేది ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications