వైసీపీ ఎమ్మెల్యే స్ఫూర్తితో: పారిశుద్ధ్య పనుల్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే: బ్లీచింగ్ పౌడర్ చల్లి..
రాజమహేంద్రవరం: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బియ్యపు మధూసూధన్ రెడ్డి మొన్నటికి మొన్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి డ్రోన్ల ద్వారా నిర్వహించిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. లాక్‌డౌన్ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. కొన్ని గంటల పాటు శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై పోలీసులతో కలిసి తిరుగాడారు.
ఆయన నుంచి స్ఫూర్తి పొందినట్టుంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ మాజీ మంత్రి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లతో కుట్టిన దుస్తుల ధరించి, తలకు క్యాప్ పెట్టుకుని, వీపునకు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లే యంత్రాన్ని అమర్చకుని మరీ ఆయన పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు.

తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. శానిటైజ్ పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. మాస్క్‌లను అందజేశారు. పారిశుద్ధ్య పనులపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోందని, ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్య పనులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని సూచించారు.
పరిసరాల పరిశుభ్రతపై ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. ఆ నిర్లక్ష్యాన్ని వదిలించడానికే తాను స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. తన నియోజకవర్గం పరిధిలో శానిటైజింగ్ స్ప్రే చేశానని, ప్రజలకు దానిపై అవగాహన కల్పించానని అన్నారు. కరోనా వైరస్ ముప్పు ముంచుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడు కూడా బాధ్యతతో మెలగాలని హితవు పలికారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావలని అన్నారు.
సామాజిక స్పృహ మన అందరికి అవసరం.ఇది మన బాధ్యత. ఈ న వంతు బాధ్యత గా ఈ విపత్కర పరిస్థితుల్లో నగరం లో సానిటైజేషన్ చెయ్యడం జరిగింది.
— Gorantla buchaiah chowdary (@GORANTLA_BC) March 27, 2020
మనం అందరం పరిశుభ్రంగా మెలగడం అత్యంత అవసరం
ఈ రోజు రాజమహేంద్రవరం లో స్వయంగా సానిటైజింగ్ స్ప్రే చేసి పుర ప్రజానీకానికి అవగాహన కల్పించా.#GBC#BreakTheChain pic.twitter.com/gURRxUZ5jg












Click it and Unblock the Notifications