పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు పరస్పర సహకారంపై ఆధారపడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో కీలక అంశాలపై చర్చలు సాగాయి.
సమావేశంలో మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి లోకేష్‌ను ఆత్మీయంగా సత్కరించారు. ఈ భేటీలో విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి మంత్రి లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఎడ్యుకేషన్ మోడల్, దాని ద్వారా వస్తున్న ఫలితాలపై సీఎం ఆసక్తిగా తెలుసుకున్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి లోకేష్‌కు వివరించారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ రంగంలో టాటా సంస్థల సహకారంతో ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని మంత్రి లోకేష్‌ను ఆహ్వానించారు.
అలాగే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ దేవస్థానం అభివృద్ధి పనుల గురించి సీఎం వివరించారు. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఈ ప్రాంతంలో వందల కోట్ల రూపాయలతో రహదారులు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చూపని చొరవతో ఆలయ ప్రాంతాన్ని ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
పెట్టుబడుల ఆకర్షణలో తెలుగు రాష్ట్రాలు పోటీపడుతూనే, ఒకదానికొకటి సహకరిస్తే దేశానికే ఆదర్శంగా నిలవగలవని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. విద్య, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పరస్పర అనుభవాలను పంచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. పరస్పర సహకారంతోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి సాధిస్తాయని, పెట్టుబడుల సాధనలో కొత్త దిశానిర్దేశం చేయగలవని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Happy to meet Telangana CM Shri. Revanth Reddy garu in #Davos. We had a warm, constructive discussion on education reforms, IT growth, and skill development in the two states. I strongly believe that the Telugu states can grow faster and stronger through mutual cooperation. We… pic.twitter.com/d20ROW2WIV
— Lokesh Nara (@naralokesh) January 22, 2026












Click it and Unblock the Notifications