పెరిగిన ఉష్ణోగ్రతలు, దేశంలోనే రికార్డు- ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!
వేసవి తీవ్రత అప్పుడే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పొడి గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నా నాలుగు రోజుల పాటు ఇదే రకంగా ఎండలు ఠారెత్తించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో, పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది. దేశంలోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో ఉదయం వేళ పొగమంచు కొనసాగుతోంది. దీంతో, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రికార్డు ఉష్ణోగ్రతలు
రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో ఎండ ఠారెత్తించింది. సీమతో పాటుగా కోస్తాలోనూ పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో వాతా వరణం వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదైంది. కోస్తాలో పలుప్రాంతాల్లో ఉదయంపూట పొగమంచు కురిసింది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో రాత్రిపూట చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ జిల్లాలకు అలర్ట్
మరో నాలుగు రోజుల పాటు సీమతో పాటుగా కోస్తా జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా పొగమంచు కురుస్తుందని, కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
వచ్చే నెల మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
తాజా అంచనాలు
ఇంకా ఫిబ్రవరి లోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం పైన వాతావరణ శాఖ తాజాగా తమ అంచనాలను వెల్లడించింది. తెలంగాణ జిల్లాల్లోనూ వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండలో, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల మేర ఉష్ణోగ్ర తలు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో పలు జిల్లాల్లో దేశంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం తో రానున్న రోజుల్లో పెరిగే తీవ్రత పైన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని వాతావరణ శాఖ తో సహా వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications