రణరంగంగా తాడిపత్రి; టీడీపీ వర్సెస్ వైసీపీ.. పోలీసులపైనా రాళ్ళదాడులు, వాహనాల ధ్వసం; పెద్దారెడ్డి అరెస్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాయలసీమలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓవైపు పోలింగ్ కొనసాగుతున్న వేళ తాడిపత్రి రణరంగంగా మారింది. వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివాన అయ్యింది.
తాడిపత్రి పోలింగ్ బూత్ వద్ద పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి
పోలింగ్ ప్రారంభమైన తర్వాత రిగ్గింగ్ చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి వర్గాలు పోటాపోటీగా ఆందోళనలకు దిగాయి. ఓం శాంతినగర్ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతు వద్ద ఘర్షణ చోటుచేసుకోవటంతో ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. అనంతరం టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి , జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరి తర్వాత ఒకరు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు.

రాళ్ళ దాడి... తాడిపత్రిలో ఉద్రిక్తత
టిడిపి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఇరువురు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరు వర్గాలు కేకలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతే కాదు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడితో బీభత్సం సృష్టించాయి. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
పోలీసులపై రాళ్ళ దాడి, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వాహనం ధ్వంసం
అయితే ఇక్కడ ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా వారి పైన కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు.రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, ఇరువర్గాలకు చెందిన ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిలో టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత రెడ్డి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
పెద్దారెడ్డి , ఆయన కుమారుడి వాహనాలు ధ్వంసం.. పెద్దారెడ్డి అరెస్ట్
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనంతో పాటు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కంది గోపుల మురళి తోపాటు వైసీపీ వర్గీయులకు చెందిన మరో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమిత్ బర్దర్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications