తమ్ముళ్లు నో: జూఎన్టీఆర్ ఫెయిల్యూర్ వెనుక..! ట్విస్ట్
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రాలు వరుసగా విజయవంతం కాకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందా!? అంటే కావొచ్చుననే అంటున్నారు. ఆది, సింహాద్రి సినిమాలతో బ్లాక్ బ్లస్టర్ హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ చిత్రాలు ఆదరణ నోచుకోక పోవడానికి రాజకీయ కోణం ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దమ్ము చిత్రం వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలు తెరపైకి వచ్చాయి.
అప్పుడు దమ్ము విజయం సాధించలేకపోయింది. ఈ కారణంగానే ఎన్టీఆర్ బయటకు వచ్చి తాను కట్టె కాలే వరకు తాత స్థాపించిన టిడిపితోనే ఉంటానని చెప్పారనే ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత వచ్చిన బాద్‌షా, రామయ్యా వస్తావయ్యాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఇన్నాళ్లు ఆదరించిన తెలుగు తమ్ముళ్లు జూనియర్‌ను దూరం పెట్టారని అంటున్నారు. దమ్ము సినిమా సమయంలో బాలయ్య ఎస్సెమ్మెస్‌లు కూడా పంపినట్లు ప్రచారం సాగింది.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ సమయంలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడి సీనియర్ నటులకు టఫ్‌గా మారిన జూనియర్ ఇప్పుడు ఆ స్థాయిలో లేరంటున్నారు. వారసత్వ రాజకీయాలకు తోడు ఇటీవల బాలకృష్ణ రెండో కూతురు పెళ్లికి జూనియర్ రాలేదు. దీంతో ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు బాలయ్య అభిమానులు యంగ్ టైగర్ సినిమాలను బైకాట్ చేశారంటున్నారు.
ఈ కారణంగా అతని సినిమాలు అనుకున్నంత ఆదరణ పొందడం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ తన సొంత సత్తా చూపించాల్సిన అవసరం ఉందని అభిమానులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులైన ఎమ్మెల్యే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. జూనియర్ కూడా పరోక్షంగా జగన్‌కు మద్దతిస్తున్నారనే అనుమానాలు టిడిపి క్యాడర్‌లో ఆగ్రహానికి కారణమైందంటున్నారు.
హిట్ - ఫట్ ట్విస్ట్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే జూనియర్‌తో హరీష్ తీసిన రామయ్యా వస్తావయ్యా పరాజయం మూటగట్టుకుంది. కల్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతనొక్కడే చిత్రం సూపర్ హిట్. అదే డైరెక్టర్ నుండి వచ్చిన అశోక్ ఫ్లాప్. కిక్ చిత్రం హిట్. కానీ ఊసరవెల్లి ఆదరణకు నోచుకోలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బాలయ్య సింహా సూపర్ హిట్. బోయపాటి తీసిన ఎన్టీఆర్ దమ్ము విజయవంతం కాలేదు. అయితే సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పే వారు కూడా లేదు.












Click it and Unblock the Notifications