హీరోయిన్ గా తొలిసారి ట్రాన్స్ జెండర్!!
ట్రాన్స్ జెండర్లు.. నిన్న మొన్నటి వరకు సమాజంలో చులకనగా చూడబడి ఏహ్య భావానికి గురైనవారు. కానీ ఇప్పుడిప్పుడే సమాజం వారిని మనుషులుగా గుర్తిస్తుంది. వారిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి అందుకు తగ్గ అవకాశాలు ఇప్పుడిప్పుడే వారికి లభిస్తున్నాయి. ట్రాన్స్ జెండర్ లలో బాగా చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, మంచి నటులు కూడా ఉన్నారు.
ఒకప్పుడు ట్రాన్స్ జెండర్లు అంటే చాలా చిన్నచూపు ఉండేది. వాళ్లు రైళ్లలో, షాప్ ల ముందు భిక్షాటన చేస్తూ జీవనం సాగించడం మాత్రమే చేస్తూ ఉండేవారు. వాళ్ళను చూస్తేనే జనం దూరంగా పారిపోయే వారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. వారు తమ హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. సమాజంలో అందరితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటు ప్రభుత్వాలు కూడా వారిని పైకి తీసుకురావడానికి, వారిలో ఉన్న టాలెంట్ ను వెలికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ పరిణామాలు ట్రాన్స్ జెండర్లకు మంచి అవకాశాలను ఇస్తున్నాయి. తాజాగా కన్నడ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సంచలన, ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్ హీరోయిన్ గా సినిమా తీస్తున్నారు.
మిస్టర్ అండ్ మిసెస్ మన్మధ సినిమాలో ఒక ట్రాన్స్ జెండర్ ను హీరోయిన్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం పనిచేయడానికి హీరోయిన్ గా మొత్తం ఆరుగురిని ఎంపిక చేయగా, వారిలో ట్రాన్స్ జెండర్ వైశాలి ఒకరు. దీంతో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ వైశాలి ఒక సినిమాలో హీరోయిన్ గా నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఒక్కొక్క రంగంలో నిదానంగా కాలు పెడుతున్న ట్రాన్స్ జెండర్ లు, ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్లుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం. ఈ అవకాశంతో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సంతోషం వ్యక్తం చేస్తుంది. తమలో ఉన్న టాలెంట్ కి తగిన అవకాశాలు, ఎటువంటి వివక్ష లేకుండా ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సినిమాలో ఒక ట్రాన్స్ జెండర్ కు హీరోయిన్ గా అవకాశం ఇస్తునందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ లకు ధన్యవాదాలు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications