TTD: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 18 గంటలు; వసతి కష్టాలు!!
కలియుగ ప్రత్యక్ష దైవం, కోరి కొలిచిన వారి కొంగు బంగారం తిరుమలలో కొలువు దీరిన వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులు పూర్తయ్యి, మళ్ళీ స్కూళ్ళు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఇప్పుడు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ
ఈసారి ఎండలు బాగా మండటంతో వేసవిలో సెలవులు వచ్చినప్పటికీ ఎండల దెబ్బకు భయపడిన చాలా మంది భక్తులు అప్పుడు తిరుమల ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక వర్షాలు ప్రారంభమై కాస్త వాతావరణం చల్లబడటంతో ఇప్పుడు తిరుమలకు వెళ్తూ ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
ఈరోజు మంగళవారం అయినప్పటికీ.. భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులకు వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ ఫుల్
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నేడు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలు
ఇక ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వీరిలో 33 వేల 869 మంది తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు గా ఉంది.
నేడు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఇదిలా ఉంటే అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 11వ తేదీ, నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న క్రమంలో బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కాగా నేడు నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications