వైభవంగా అక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు.. శుభవార్త చెప్పిన టీటీడీ!!
తిరుమలలో ప్రతీ నెలలో శ్రీవారికి విశేష వేడుకలు జరుగుతాయి. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా అనేక ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని కడపజిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే పోస్టర్ టిటిడి ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. జనవరి 28నుండి ఫిబ్రవరి 7వతేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 7వరకు దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు
ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపధ్యంలో జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.

వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
ఇక జనవరి 30 వ తేదీ ఉదయం సూర్యప్రభవాహనంపై స్వామి ఊరేగుతాడు. అలాగే రాత్రి పెద్దశేష వాహనం పై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. జనవరి 31వ తేదీన ఉదయం - చిన్నశేష వాహనంపై భక్తులను కరుణిస్తాడు. ఆపై రాత్రి సింహ వాహనంపై ఊరేగుతాడు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం పై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం కల్పిస్తాడు.
ఫిబ్రవరి 3న స్వామి కళ్యాణోత్సవం
ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తాడు. రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతాడు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. ఇక రాత్రి గజ వాహనంపై ఊరేగుతాడు. రూ.300/- చెల్లించి భార్యాభర్తలు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు.
రాత్రి ధూళి ఉత్సవం చేస్తారు.
ఫిబ్రవరి 7న పుష్ప యాగం
ఫిబ్రవరి 5 వ తేదీన ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం పై విహరిస్తారు. ఇక ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి - హంసవాహనంపై ఊరేగించి ఆపై ధ్వజావరోహణం చేస్తారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.
కన్నుల పండుగగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈ సందర్భంగా టీటీడీ పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దేవుని కడప ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ కన్నుల పండుగగా నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications