హోం మంత్రిగా వంగలపూడి అనితకు పట్టం.. నక్క తోక తొక్కిన టీచరమ్మ!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలను కేటాయించారు. జూన్ 12వ తేదీన చంద్రబాబుతో పాటు 24 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వీరందరికీ ప్రస్తుతం మంత్రి పదవులను కేటాయించారు. రాష్ట్రంలో అత్యంత పవర్ ఫుల్ గా భావించే హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు చంద్రబాబు.
నక్కతోక తొక్కిన వంగలపూడి అనిత
దీంతో మొదటిసారి మంత్రి పదవి దక్కిన వంగలపూడి అనిత అత్యంత ప్రతిష్టాత్మకమైన హోం మంత్రిగా అవకాశం దక్కడంతో నక్కతోక తొక్కిందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ మహిళలకే హోం మంత్రిగా అవకాశం దక్కగా చంద్రబాబు కూడా మహిళా ఎమ్మెల్యేకే హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు.

అనితకు కీలక పదవి అందుకే
మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే అయిన వంగలపూడి అనితకు హోం మంత్రి ఇవ్వడం కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. గత ఐదేళ్ల కాలంలో పార్టీ పట్ల వంగలపూడి అనిత చూపించిన విధేయతకు, ప్రతిపక్షాలను ఆమె సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరుకు చంద్రబాబు ఆమెకు సముచిత స్థానం ఇచ్చారని కూడా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
ఒకప్పటి టీచరమ్మ ఇప్పుడు హోం మంత్రి
ఒకప్పటి టీచరమ్మ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి హోం మంత్రిగా అవకాశాన్ని దక్కించుకోవడాన్ని పలువురు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. 2014కు ముందు టిడిపి తో తన రాజకీయ ప్రస్తాన్ని ప్రారంభించిన వంగలపూడి అనిత 2014 నుండి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో టిడిపి నుండి కొవ్వూరు నియోజకవర్గం లో పోటీ చేసి తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో అనిత పోరాటానికి గుర్తింపు
అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి గత ప్రభుత్వ హయాంలో మహిళా సమస్యల పైన మహిళల పై జరుగుతున్న దారుణాల పైన తన గళాన్ని బలంగా వినిపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వెనక్కు తగ్గకుండా వంగలపూడి అనిత వైసిపి ప్రభుత్వం పాలనపై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఏకంగా హోం మంత్రిగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేయనున్నారు.












Click it and Unblock the Notifications