తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో చంద్రబాబుకు వీసీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల మీద కొలువుతీరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు నిత్యం శ్రీవారి దర్శనానికి వస్తారు అన్న విషయం తెలిసిందే. ఒక మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు.
సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్
అటువంటి శ్రీవారి దర్శనానికి తెలంగాణరాష్ట్రం నుంచి వెళ్లే పర్యాటకులకు దర్శన భాగ్యాన్ని కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ ఏపీ సీఎం చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి, పర్యాటకానికి టిటిడి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా కేటాయించాలని ఆయన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నిన్న తిరుమల శ్రీవారిని విఐపి బ్రేక్ సమయంలో దర్శించుకున్న విసి సజ్జనార్ ఈ మేరకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

దర్శన టికెట్ల కోసం చంద్రబాబుకు, టీటీడీకి విజ్ఞప్తి
ఆరు నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు టికెట్లు జారీని నిలిపివేసింది అని ఆయన పేర్కొన్నారు. ఈ దర్శన టికెట్ల అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి విన్నవించామని మళ్లీ టిక్కెట్లు జారీ చేయాలని కోరామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో తాము టిటిడి అధికారులను కలిసి దర్శన టికెట్లను జారీ చేయాలని కోరుతామని సజ్జనార్ పేర్కొన్నారు.
గతంలో ఆర్టీసీకి, పర్యాటక శాఖకు దర్శన టికెట్లు
గతంలో టీటీడీ ఆర్టీసీ తో పాటు పర్యాటక శాఖకు కొన్ని దర్శన టికెట్లను కేటాయించేదని, కానీ గత ఆరు నెలల క్రితం ఈ కోటాను నిలిపి వేసిందని మళ్లీ ఆ కోటాను పునరుద్ధరించవలసిందిగా కోరతామని వీసీ సజ్జనార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునర్ ఆలోచన చేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్టు కూడా ఆయన పేర్కొన్నారు.
ఆ సౌకర్యం భక్తులకు ఉపయోగం
టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ప్రభుత్వం మళ్లీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. దర్శన టికెట్లు ఉంటే తెలంగాణా పర్యాటక రంగానికి, ఆర్టీసీకి టీటీడీ ఊతం ఇచ్చినట్టు అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications