హిందూమతంలోకి జగన్ .! ఇప్పటికీ తిరుమల నెయ్యి కల్తీ-సాయిరెడ్డి కామెంట్స్..!
రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) .. ఇవాళ తిరుపతిలో మరో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే తమ పార్టీ అమలు చేయబోయే 15 ప్రతిపాదనలన్ని ఇప్పటికే ప్రకటించిన సాయిరెడ్డి.. ఇవాళ మరో ఐదు ప్రతిపాదనలు చేశారు. .. వీటితో కలిపి మొత్తం 20 ప్రతిపాదనలు చేసినట్లు అయింది. అన్ని కులాలు, మతాల్ని కలుపుకుపోతూ తమ పార్టీ పనిచేస్తుందని సాయిరెడ్డి మరోసారి వెల్లడించారు. కూటమి, వైసీపీ తర్వాత మూడో స్ధానంలో ఉండబోయే తమ పార్టీ.. భవిష్యత్తులో రెండో, ఒకటో స్ధానానికి ఎదుగుతుందని సాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణ అబద్దమని దర్యాప్తులో తేలిందని, దీని వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. సీఎంగా ఉన్నత స్ధానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కల్తీ జరిగిందని, లోపభూయిష్టమైన నెయ్యి పంపిణీ జరిగినా, జంతువుల కొవ్వు మాత్రం కలవలేదన్నారు. కల్తీ లేని కిలో నెయ్యి మార్కెట్లో కొనాలంటే వెయ్యి రూపాయలు అవుతుందని, కానీ గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో చూసినా గరిష్టంగా కూటమి ప్రభుత్వం 658 రూపాయలకు కొనుగోలు చేస్తుందన్నారు. అంటే ఇది స్వచ్చమా కల్తీయా అని అడిగారు. వైసీపీపై విమర్శలు చేసి ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది ఏంటని నిలదీశారు.

హిందువుల్ని కులాల పేరుతో విడదీస్తున్న రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. మతం మారిన వారు కులాన్ని కూడా తమతో తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కులాన్ని, మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని జగన్, చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు కులాన్ని, జగన్ మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. హిందువు అయి హిందువులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే.. జగన్ క్రైస్తవుల్ని, రెడ్లను తన రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ముస్లింలు, క్రైస్తవులు హిందూ ఆలయాలకు వచ్చి తీర్థం ఇచ్చే తీసుకోకుండా రెండు వేళ్ల మధ్యలో నుంచి వదిలేస్తున్నారని, ప్రసాదాల్ని సైతం తీసుకున్నా తినకుండా పక్కనబెడతారన్నారు. హిందువులు మాత్రం చర్చికి, మసీదులకు వెళ్లిన టోపీ పెట్టుకుని వాళ్ల సంప్రదాయాలు పాటిస్తారన్నారు. హిందువేతరులకు పరమత సహనం లేదన్నారు.
దళితుల్ని ఆలయాల్లోకి అనుమతించకపోతే నాలుగేళ్ల శిక్ష విధించేలా చట్టాలు తెస్తామని సాయిరెడ్డి తెలిపారు. టీటీడీని ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు నెయ్యి కల్తీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పరకామణి చోరీ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. హిందూ ఆలయాల డబ్బుల్ని పాస్టర్లు, ముస్లిం పెద్దలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓ మతం డబ్బుల్ని ఇతర మతాలకు ఖర్చుపెట్టకుండా చట్టం తీసుకొస్తామన్నారు. జగన్ కు రెడ్ల ఓట్లు కావాలంటే ద్వంద ప్రమాణాలు పాటించవద్దని సూచించారు. జగన్ హిందూమతానికి తిరిగి వస్తే జగన్మోహన్ రెడ్డి పేరుకు సార్ధకత వస్తుందన్నారు. జగన్ హిందూమతంలో చేరతానంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు కరువు వస్తుందని, రాష్ట్రం అల్లకల్లోలమై ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని ఎల్ నినో పరిస్ధితుల్ని గుర్తుచేశారు. లక్ష కోట్లతో రాయలసీమలో ఉద్యానవనాలు పెంచుతామన్న చంద్రబాబు అందరినీ మోసం చేస్తున్నారన్నారు. ఎంత పెద్ద తప్పు అయినా భయం, భక్తీ లేకుండా చేసే కుటుంబాలు వైఎస్, చంద్రబాబువి అన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింలు పెరిగిపోయి హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు కాబోతున్నారని సాయిరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా చర్చిలు, మసీదులు ఉన్నాయన్నారు. ఎస్ఐఆర్ ను తాను సమర్దిస్తున్నానని, వేర్వేరు చోట్ల ఓట్లు కలిగి ఉండటం నేరమన్నారు.














Click it and Unblock the Notifications
