ఆ సీడీ షాపులోనే రంగా హత్యకు ప్లాన్: రాగమాలిక రామకృష్ణ అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రతి రాజకీయ నేతకు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని, ఒక రేపిస్టు, హంతకుడు రాజకీయాల్లో ఉండకూడదని విమర్శించారు.

వంగవీటి హత్య కేసులు వెలగపూడి నిందితుడు..
వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని, రాగమాలిక సీడీషాప్‌ను అడ్డాగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రంగాను కత్తితో పొడిచి హత్య చేసినవాళ్లలో వెలగపూడి ఒకరని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వెలగపూడిని మొదట రాగమాలిక రామకృష్ణ అనే పిలిచేవారన్నారు. వెలగపూడి విజయవాడ నుంచి విశాఖకు పారిపోయిన వ్యక్తని అన్నారు.

కాపీ కొట్టి పరీక్షలు పాసైన వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు
వెలగపూడి రామకృష్ణ తండ్రి బ్రహ్మశ్వరరావు అవినీతిపరుడు కాబట్టే ఎలక్ట్రిసిటీ బోర్డు వీఆర్ఎస్ ఇచ్చి సాగనంపిందని విజయసాయి రెడ్డి చెప్పారు. వెలగపూడి రామకృష్ణ ఇంటర్ పరీక్షలు కూడా ఆయన సోదరుడు దేవగుడి ఆదినారాయణ సహాయంతో కాపీకొట్టి రాశాడని ఆరోపించారు. ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి వెలగపూడి అని విమర్శించారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతానని అన్నారు.

వెలగపూడి బినామీలకు విజయసాయి రెడ్డి వార్నింగ్
వెలగపూడికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్లు ఉన్నాయని.. విశాఖలో కూడా బినామీ పేర్లు ఇళ్లు ఉన్నాయని విజయసాయి రెడ్డి చెప్పారు. బైరెడ్డి పోతన్న రెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్రకుమార్, సతీష్.. వెలగపూడి బినామీలని తెలిపారు. వెలగపూడి బినామీలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు విజయసాయి రెడ్డి.

వెలగపూడి అవినీతి చిట్టా అంటూ..
విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తని అన్నారు. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారని ఆరోపించారు. ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి రౌడీషీట్ తీయించుకున్నారని తెలిపారు. వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను గాయపర్చిన కేసులో వెలగపూడి నిందితుడని, రుషికొండ లే అవుట్‌లో రెండు ప్రభుత్వ ప్లాట్లు కొట్టేసిన వ్యక్తి వెలకగపూడి అని విజయసాయి రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications