కృష్ణా నదిపై కొత్తగా మరో రైల్వే వంతెన.. గూడూరు మార్గంలో నాలుగో లైన్ - కష్టాలకు చెక్..!!
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉన్న మార్గాల్లో కొత్త మార్గాల నిర్మాణానికి కీలక అడుగులు పడుతున్నాయి. ఏపీ కేంద్రంగా రైల్వే శాఖ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతోంది. అందులో భాగంగా విజయవాడ వద్ద కృష్ణా నదిపై కొత్తగా మరో రైల్వే వంతెన నిర్మించనున్నారు. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. వీటికి సంబంధించిన డీపీఆర్ లు సిద్దం అయ్యాయి.
ఏపీలో కొత్త రైల్వే ప్రాజెక్టుల పైన రైల్వే శాఖ ఫోకస్ చేసింది. అందులో భాగంగా విజయవాడ వద్ద కృష్ణా నదిపై కొత్తగా మరో రైల్వే వంతెన నిర్మాణానికి అనుమతి లభించింది. విజయవాడ జంక్షన్-కృష్ణా కెనాల్ జంక్షన్ స్టేషన్ల మధ్యలో విజయవాడ-సీతానగరం మధ్య ఈ కొత్త వంతెన రానుంది. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇందులో విజయవాడ నుంచి గూడూరుకు 293 కి.మీ. నాలుగో లైన్ నిర్మాణానికి రూ.5,858 కోట్లతో డీపీఆర్ రూపొందించి బోర్డుకు పంపారు. ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 1.30 కిలో మీటర్ల పొడవైన మరో రైల్వే వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం విజయవాడ-సీతానగరం మధ్య కృష్ణా నదిపై రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకదానిపై రెండు రైల్వే లైన్లు,మరో వంతెనపై ఒక లైన్ ఉంది.

రైల్వే శాఖ తాజా నిర్ణయాలతో
కాగా, తాజా ప్రతిపాదనల మేరకు వీటికి సమీపంలోనే మూడో వంతెన నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే తెనాలి,గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు కృష్ణా కెనాల్ స్టేషన్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా విజయవాడ మీదుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు వైపు వెళ్లే గూడ్స్ రైళ్ల రాకపోకలు కూడా సులభ తరం అవుతాయని అధికారులు చెబుతున్నారు. గుడివాడ-విజయవాడ రైల్వే మార్గంలోని ఇందుపల్లి నుంచి విజయవాడ-తెనాలి మార్గంలోని దుగ్గిరాల వరకు 36.8 కిలోమీటర్ల మేర కొత్తగా డబుల్ లైన్ నిర్మించనున్నారు. విశాఖపట్నం వైపు నుంచి చెన్నై దిశగా వెళ్లే గూడ్స్ రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించకుండానే ఈ బైపాస్ మార్గం ద్వారా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై రద్దీ తగ్గనుంది. ప్రస్తుతం ఎదురవుతున్న నిరీక్షణ సమస్య తగ్గి రైళ్లు వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం దక్కనుంది.













Click it and Unblock the Notifications
