విజయవాడ ఉత్సవ్.. మైసూర్ తరహాలో ఏపీలో దసరా ఉత్సవాలు!
దసరా అనగానే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మైసూర్. మైసూర్ లో దసరా వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మైసూర్ తరహాలో దసరా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో దేశం దృష్టిని ఆకర్షించేలా అత్యంత ఘనంగా మైసూర్ తరహాలో ఉత్సవాలు చేయడానికి రంగం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.
దసరాకు విజయవాడ ఉత్సవ్
విజయవాడ ఉత్సవ్ పేరుతో విజయవాడ నగరంలోని నది పరివాహక ప్రాంతాలతో పాటు ప్రముఖ ప్రదేశాలలో సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, హెలికాప్టర్ రైడ్లు, దుకాణ సముదాయాల స్టాల్స్, మిరిమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. దసరా పండుగ అంటే ప్రతి ఒక్కరు విజయవాడ ను సందర్శించే విధంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దసరా సంబరాలకు విద్యుత్ దీపాలంకరణలతో విజయవాడలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు.

భక్తులను, పర్యాటకులను ఆకర్షించేలా ప్లాన్
విజయవాడకు వచ్చే ప్రతి ఒక్కరూ రెండు రోజులపాటు విజయవాడలో ఉండి ఈ దసరా వేడుకలను తిలకించి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. దసరా సమయంలో బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి 12నుండి 15లక్షల మంది భక్తులు విజయవాడకు వస్తుంటారు. అయితే వీరు కనకదుర్గమ్మను దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వేడుకల ద్వారా విజయవాడకు వచ్చే భక్తులను,పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తున్నారు.
అంతర్జాతీయ కార్నివాల్ తరహా వేడుకలు
ఇక విజయవాడ ఉత్సవ్ లో ప్రధానంగా పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాలలో అంతర్జాతీయ స్థాయిలో కార్నివాల్ తరహా వేడుకలు జరగనున్నాయి. అలాగే ఒక సెలబ్రేషన్ ను తలపించేలా జల క్రీడలు, దాండియా నృత్యాలు, ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, పిల్లల కోసం ప్రత్యేక క్రీడ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.
గొల్లపూడి లో 39 ఎకరాలలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్
దుకాణ సముదాయాలకు సంబంధించి స్టాల్స్ ను కూడా పెట్టనున్నారు. గొల్లపూడి లో 39 ఎకరాలలో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 11 రోజులపాటు రోజుకొక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుండి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ జి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడతాయి.
హెలికాప్టర్ రైడ్, గ్యాస్ ఎయిర్ బెలూన్స్ రైడ్
ఈ దసరాకు హెలికాప్టర్ రైడ్ ను, గ్యాస్ ఎయిర్ బెలూన్స్ లో ఆకాశంలో విహరించే అనుభూతిని విజయవాడ వాసులు పర్యాటకులు పొందడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతోపాటు విజయవాడ ఉత్సవ్ పేరుతో వేడుకలను నిర్వహించి మైసూర్ తరహాలో మరిచిపోలేని విధంగా దసరాను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications