Tech Hubs: విజయవాడ, విశాఖ, తిరుపతికి గుడ్ న్యూస్...
దేశవ్యాప్తంగా టెక్నాలజీ హబ్ లుగా ఎదుగుతున్న టూటైర్ నగరాలపై డెలాయిట్-నాస్కామ్ ఉమ్మడిగా నిర్వహించిన అధ్యయనం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. విభజన తర్వాత ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో వెనుకబడినట్లు కనిపిస్తున్న ఏపీలో మూడు నగరాలు టెక్నాలజీ హబ్ లుగా ఎదుగుతున్నట్లు డెలాయిట్-నాస్కామ్ రిపోర్ట్ పేర్కొంది.ఆయా నగరాల్లో సాఫ్ట్ వేర్ పరిశ్రమలు, ఉత్పత్తి, ఎగుమతులు ఇలా పలు అంశాల్ని దృష్టిలో ఉంచుకుని వీటిని ఎమర్జింగ్ టెక్ హబ్స్ గా ప్రకటించింది.
ఈ నగరాల్లో టెక్నాలజీ మార్కెట్లో కొత్త సంస్ధల ప్రవేశం, విద్యావంతులైన సిబ్బంది.. ఈ రంగంలో మరింత మందిని ఆకర్షించేలా చేస్తున్నట్లు డెలాయిట్-నాస్కామ్ ఉమ్మడిగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అలాగే ఈ రిపోర్టులో ఏపీలో టూటైర్ నగరాలుగా ఉన్న విజయవాడ, విశాఖ,తిరుపతి టెక్ హబ్ లుగా ఎలా ఎదుగుతున్నాయో కూడా వివరించారు. వీటి ప్రకారం ఈ నగరాల పట్ల ఆకర్షితులవుతున్న సంస్ధలు, అవి కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో తెలిపారు.

విజయవాడనే తీసుకుంటే హార్డ్ వేర్, ఐటీ, ఫుడ్ టెక్, సాఫ్ట్ వేర్, డేటా స్టార్టప్స్ రంగాల్లో నగర ప్రాధాన్యం పెరుగుతుందని ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రత్యేక ఆర్ధిక మండళ్లలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రీమియర్ సంస్ధలు, పెట్టుబడుల రాక టెక్నాలజీ మ్యాప్ లో విజయవాడకు చోటు కల్పించాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే తిరుపతి కూడా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ హబ్ గా ఎదుగుతున్నట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది.
తిరుపతిలో మెడికల్ ట్రాన్ స్క్రిప్షన్, రెవెన్యూ సైకిల్ మేనేజ్ మెంట్ రంగాల్లో తిరుపతి బాగా ఎదుగుతోందని తెలిపింది. ఐఐటీతో పాటు ఇన్ హౌస్ ఇంక్యుబేటర్ల నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో తిరుపతిలో స్టార్టప్ లు బాగా అభివృద్ధి చెందుతున్నట్లు డెలాయిట్-నాస్కామ్ అధ్యయనం తెలిపింది. అలాగే వైజాగ్ పోర్ట్ అండ్ లాజిస్టిక్ హబ్ గా ఎదుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. పలు ఈకామర్స్-లాజిస్టిక్ సెంటర్లకు విశాఖ కేంద్రంగా మారిందని తెలిపింది. ప్రధాన మార్కెట్లకు విశాఖతో ఉన్న కనెక్టివిటీ ఉపయోగపడుతోందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications