ఢిల్లీ ప్రకటనతో రివర్స్ఐతే: రాజీనామాపై కిరణ్ డైలమా!?

కేవలం చర్చే జరుగుతుందా? లేక ఓటింగ్ కూడా ఉంటుందా? అన్న అంశంపైనే కిరణ్ రాజీనామా నిర్ణయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇన్నాళ్లూ శాసనసభకు బిల్లు వస్తే ఓడిస్తామని, తద్వారా తెలంగాణ నిర్ణయాన్ని ఎదుర్కొంటామని కిరణ్ చెప్పుకొస్తున్నారు. తీర్మానాన్ని ఓడించడం ద్వారా రాష్ట్ర విభజనపై న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయించవచ్చునన్న భావాన్ని ఆయన పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.
అప్పటివరకు తాను రాజీనామా చేయబోనని, మంత్రులు కూడా రాజీనామాలు చేయవద్దని పిలుపునిచ్చారు. అయితే తరువాతి కాలంలో శాసనసభకు కేవలం ముసాయిదా మాత్రమే వస్తుందని, దీనిపై తీర్మానం అవసరం లేదని కేంద్ర మంత్రులు ప్రకటించడంతో ముఖ్యమంత్రి కూడా పునరాలోచనలో పడి ఉంటారని అంటున్నారు. సభలో చర్చించిన తరువాత తీర్మానం అవసరం లేకపోతే ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు నీరుగారిపోయి ప్రజల నుంచి విమర్శలు వస్తాయని భావిస్తున్నారట.
దీంతో కేవలం చర్చేనన్న పరిస్థితి ఉంటే శాసనసభ సమావేశం కావడానికి ముందుగానే రాజీనామా చేస్తే మంచిదని కొంతమంది చేస్తున్న సూచనలపైనా కిరణ్ దృష్టి సారిస్తున్నారట. శాసనసభకు ముందుగానే రాజీనామా చేస్తే వాస్తవ పరిస్థితులు, తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న అంశాలపై ప్రజలకు చెప్పుకునే వెసులుబాటు ఉంటుందన్న భావాన్ని కిరణ్ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications