ఏపీలో ఎంట్రీకి బీఆర్ఎస్ ప్లాన్ రెడీ ? వైసీపీ సాయం, విపక్షాల టార్గెట్ ! జగన్ కు ప్రయోజనమిదే!
కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయం కూడా రెడీ అవుతోంది. త్వరలో హైదరాబాదీ ఓవైసీతో కలిసి కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడం ఖాయం. అయితే బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఏం జరగబోతోందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా బీజేపీపై వ్యతిరేకతతో ఏర్పడిన బీఆర్ఎస్ ఎంట్రీ ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్న ఇక్కడి రాజకీయ పార్టీల్లో ఎవరికి దెబ్బ కొట్టబోతోంది. అలాగే ఎవరికి మేలు చేయబోతోంది ?

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ
ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ తెలంగాణకే పరిమితమవుతూ పొత్తుల కంటే తమ సొంత బలం, సెంటిమెంట్ ను నమ్ముకుని రాజకీయాలు చేసిన టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో ఏపీతో పాటు కర్నాటక, ఇతర రాష్ట్రాల్లోనూ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా ఇప్పటికీ వైసీపీ దూకుడుతో కుదేలైన విపక్షాలకు బీఆర్ఎస్ తోడవుతుందా లేక వ్యతిరేకికా మారుతుందా, జగన్ తో కేసీఆర్ స్నేహం ప్రభావం బీఆర్ఎస్ ఎంట్రీ తర్వాత ఎలా ఉండబోతోంది ఎలా వందల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జగన్-కేసీఆర్ స్నేహం
ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో సమైక్య వాదం వినిపించి కేసీఆర్ సహా తెలంగాణ వాదులందరికీ కంటగింపుగా మారిన జగన్.. విభజన తర్వాత ఏపీకే పరిమితమయ్యారు. చంద్రబాబులా హైదరాబాద్ వ్యవహారాల్లో వేలు పెట్టలేదు. తద్వారా తాను క్లారిటీగా ఉన్నానన్న సంకేతాలు కేసీఆర్ కు వంపారు. దీంతో కేసీఆర్ కూడా 2019 ఎన్నికల్లో అవసరం లేకపోయినా జగన్ కు మద్దతిచ్చి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు.
ఆ తర్వాత కేసీఆర్, జగన్ ఇద్దరూ రెండేళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. కానీ ఎవరి రాష్ట్రంలో ప్రయోజనాలు వారికి ముఖ్యం కాబట్టి రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఇద్దరికీ చెడింది. దీంతో పరిస్దితి మళ్లీ మొదటికొచ్చింది. ఆ తర్వాత జగన్ ను తిట్టలేక, చంద్రబాబుకు మద్దతివ్వలేక కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో అడుగుపెడుతున్నారు. దీంతో వైసీపీ మద్దతు పొందడంలో బీఆర్ఎస్ సఫలమవుతుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి.

బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు?
కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియగానే వైసీపీ నేత సజ్జల స్పందించారు. ఇతర పార్టీల్లాగే బీఆర్ఎస్ కు ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు, రాజకీయాలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆ తర్వాత కూడా కేసీఆర్ ను కానీ, బీఆర్ఎస్ ను కానీ వైసీపీ విమర్శించలేదు. అలాగే విజయవాడలో రాజకీయ కార్యకలాపాలకు ఆఫీసు కూడా నిర్మించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
దీనిపైనా వైసీపీ నుంచి ఎలాంటి అభ్యంతరాల్లేవు. గతంలో రాయలసీమ లిఫ్ట్ విషయంలో తమతో విభేదించినా ఆ తర్వాత జగన్ ను టార్గెట్ చేయలేదు. అలాగే కేంద్రం వద్ద కూడా ఇరు రాష్ట్రాలకూ ఇప్పుడు తగాదాల్లేవు. జల వివాదాలు ఎలాగో అధికారులు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ నుంచి ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

బీఆర్ఎస్ ను విపక్షాలు టార్గెట్ చేస్తాయా?
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో ప్రధానంగా ప్రభావం పడేది విపక్షాల పైనే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి స్ధిరమైన ఓటు బ్యాంకు ఉంది. మిగతా ఓటు బ్యాంకును, ప్రభుత్వంపై ఉండే ప్రజావ్యతిరేకతను విపక్షాలు పంచుకోవాల్సిఉంది. ఇప్పటికే ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కు తోడు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వీటిని పంచుకోవాల్సి ఉంది.
అది కచ్చితంగా విపక్షాలపై ప్రభావం చూపించే అంశమే. ముఖ్యంగా విపక్షాల్లో ముందున్న టీడీపీపై ఆ ప్రభావం ఖాయం. అందుకే బీఆర్ఎస్ ఎంట్రీతో ముందుగా ప్రభావితమయ్యేది టీడీపీనే. ఆ తర్వాత స్ధానంలో జనసేన, బీజేపీ, మిగతా పార్టీలుంటాయి. దీంతో బీఆర్ఎస్ ఎంట్రీ తర్వాత విపక్షాలు ఆ పార్టీని టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ ఎంట్రీతో వైసీపీకి లాభం?
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ కారణంగా అత్యంత ఎక్కువ లబ్ది పొందే పార్టీ వైసీపీయే కానుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకతకు తోడు మిగతా అన్ని అంశాల్ని బీఆర్ఎస్ ఇతర విపక్షాలతో పంచుకోవాల్సి ఉంటుంది. తద్వారా వైసీపీ వ్యతిరేకత ఓటు మరింత చీలడం ఖాయం. అది అంతిమంగా ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చడం ఖాయం.
బీఆర్ఎస్ కు స్దిరమైన ఓటు బ్యాంకు లేకపోయినా వెలమ సామాజిక వర్గంతో పాటు కేసీఆర్ ను ఇక్కడి నుంచే ఆరాధించే కొన్ని వర్గాలు, ఆయనతో హైదరాబాద్ లో ప్రయోజనం పొందే వర్గాలు బీఆర్ఎస్ కు ఇక్కడ మద్దతివ్వడం ఖాయం. దీంతో ఆ విధంగానూ వీరంతా ఇటు జగన్, అటు కేసీఆర్ కు మద్దతిచ్చే పరిస్ధితి ఉండొచ్చని అంచనా. మరోవైపు ఓవైసీ కూడా బీఆర్ఎస్ కోసం ఏపీలో ఎంట్రీ ఇస్తే మాత్రం అప్పుడు వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలపై కాస్త ప్రభావం పడుతుంది. ఈ విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్న దానిపై వైసీపీ-బీఆర్ఎస్ బంధం కూడా ఆధారపడుతుందని చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications