
ఇక రాష్ట్ర బడ్జెట్ పై కసరత్తు షురూ!...నేటి నుంచే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
అమరావతి: రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం బుధవారం ఆర్థికశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తొలి భేటీ నిర్వహించనున్నారు. వచ్చే బడ్జెట్‌ను ఎలా రూపొందించాలనే విషయమై అధికారులతో లోతుగా చర్చించనున్నారు. వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు సేకరించేందుకు అవలంభించాల్సిన విధానాలపై ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో కీలక సూచనలు చేయనున్నారు.
2018-19 వార్షిక బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ముందస్తు ప్రత్యేక కసరత్తు సమావేశాలు గురువారం నుంచి శనివారం వరకు జరుగుతాయి. రోజుకు కొన్ని శాఖల చొప్పున ఆయా శాఖల అవసరతలు,ఖర్చులు, కేటాయింపుల గురించి మంత్రులు, ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి చర్చిస్తారు.

మొదటి రోజు...ఏఏ శాఖలంటే...
తొలిరోజు ఫిబ్రవరి 15 తేదీన ఆర్థిక నిపుణులు, మార్కెటింగ్, పౌరసరఫరాలు, పట్టణాభివృద్ధి, రవాణా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, శిశు సంక్షేమ, కార్మిక శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం జరుగుతుంది.

రెండో రోజు...సమావేశాల్లో...
రెండో రోజు ఫిబ్రవరి 16 తేదీ శుక్రవారం...నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, రూరల్ హౌసింగ్, ప్రజా సంబంధాలు, రోడ్లు భవనాలు, రెవెన్యూ, పర్యాటక, మైనింగ్, మానవ వనరులు, తదితర శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది.

మూడో రోజు...చివరిరోజు...సమావేశాలు...
రెండో రోజు ఫిబ్రవరి 17 తేదీ శనివారం నాడు బడ్జెట్ కసరత్తు సమావేశాల్లో చివరి రోజు హోం, అటవీ, విద్యుత్, దేవాదాయ, ఆబ్కారీ, పరిశ్రమలు, క్రీడాభివృద్ధి శాఖల మంత్రులు, పలువురు అధికారులతో సమావేశం...అదేరోజు ఖర్చులు, కేటాయింపులపై ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది.

చివరి బడ్జెట్ కావడంతో...అత్యంత ప్రాధాన్యత...
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ ఇదే కావడంతో ఈ బడ్జెట్ పై సహజంగానే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఎన్నికలకు వెళ్లబోయే ముందు ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ కాబట్టి కేటాయింపుల విషయమై ఓటు బ్యాంకు రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. చివరి బడ్జెట్ కావడంతో ప్రతిశాఖ కేటాయింపుల గురించి పట్టుబట్టే అవకాశాలు ఉంటాయి...అందువల్ల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఈ బడ్జెట్ తయారీ సవాలేనని చెప్పక తప్పదు.