చంద్రబాబు సవాల్‌కు జగన్ సై సై
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌ను సీఎం వైఎస్ జగన్ స్వీకరించారు. మూడు రాజధానులపై ఇప్పుడే ఎన్నికలకు వెళ్దామని టీడీపీ సవాల్ విసరగా దాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన అజెండాగా మారబోతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి నవరత్నాలు ప్రధాన అజెండాగా ఉండేది. వాటిల్లో చాలావరకు తీర్చారు. ఈసారి ఎన్నికలకు మూడురాజధానులే అజెండా కాబోతోందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

స్పష్టతనిచ్చిన తెలుగుదేశం
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని తెలుగుదేశం పార్టీ స్పష్టతనిచ్చింది. ఆ ప్రాంతంలోని రైతులు మొదటి విడతగా చేసిన 'న్యాయస్థానం టు దేవస్థానం' పాదయాత్రకు మద్దతిచ్చింది. తాజాగా రెండోవిడత చేస్తున్న 'అసెంబ్లీ టు అరసవెల్లి' పాదయాత్రకు మద్దతు ప్రకటించింది. రైతుల పాదయాత్ర ప్రారంభమైన సమయంలోనే ప్రభుత్వం అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రామసభలు నిర్వహించింది. అయితే వారి నుంచి నిరాకరణ ఎదురైంది. అదే సమయంలో అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి మరోసారి జగన్ ప్రస్తావించారు.

మూడు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన అజెండా!
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కూడా అమరావతితోపాటు సమానంగా అభివృద్ధి చేయాలన్నదే వైసీపీ మాటగా ఉంది. మిషన్-2024లో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల ప్రధాన అజెండాగా వైసీపీ ఉపయోగించే అవకాశం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ అజెండా అటు రాయలసీమవారిని, ఇటు ఉత్తరాంధ్ర వారిని ఆకట్టుకుంటుందనేది జగన్ భావనగా ఉంది. శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ పై చర్చ ద్వారా ప్రతిపక్ష టీడీపీపై వైసీపీ మాటలదాడి చేయడాన్ని బట్టి జగన్ సంకేతాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది.

ఏపీ సర్వతోముఖాభివృద్ధికి..
2024లో జరగబోయే ఎన్నికలకు మూడు రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ప్రధానమనే అంశంతో వైసీపీ వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సరేష్ కూడా మూడు రాజధానులనేది తమ ప్రభుత్వ విధానమని, దాన్ని అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, మూడు ప్రాంతాల అభివృద్ధితో ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications