అసెంబ్లీలో జగన్ సీటు అక్కడేనా - కూటమి తాజా ప్లాన్..!!
ఏపీలో నూతన అసెంబ్లీ కొలువు తీరనుంది. ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ, వైసీపీకి ఆ నెంబర్ లేదు. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా. వస్తే జగన్ కు సీటు ఎక్కడ కేటాయిస్తారు. కూటమి నేతల ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. గతంలో జరిగిన పరిణామాలకు సమాధానంగా నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ సమావేశాల్లో
ఏపీలో కొత్తగా ఎన్నికలైన సభ్యులతో అసెంబ్లీ సమావేశం కానుంది. గత శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలతో తాను సీఎంగానే ఈ సభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా లేదా.. తొలిరోజు నుంచే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు.

జగన్ హాజరయ్యేనా
అదే సమయంలో ప్రతిపక్ష హోదా దక్కకపోవటంతో జగన్ కు ప్రతిపక్ష నేతగా అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. సభలో ట్రెజరీ బెంచ్ లకు ఎదురుగా ప్రతిపక్ష నేత..ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించటం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవటంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సైతం సభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ,ప్రతిపక్షం అవసరం కావటంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబు- పవన్ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
స్పీకర్ నిర్ణయం ఏంటి
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నుంచి ఎన్నికైన 11మంది శాభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన వైసీపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సభకు వచ్చినా..2014-19 కాలంలో జరిగిన విధంగానే ఉంటుందని వైసీపీ నేతల అభిప్రాయం. దీంతో..అసలు జగన్ సభకు వస్తారా రారా...వస్తే కూటమి ముఖ్యలు జగన్ విషయంలో ఎలా ఉంటుందీ..జగన్ సీటు విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications