డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు ? జగన్ డిమాండ్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC 2025)పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై విపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ఇందులో మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? అంటూ సీఎం చంద్రబాబు (Chandrababu)ను ప్రశ్నించారు.
పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.
తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? అని అడిగారు.
మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ''డార్క్ ఆపరేషన్''ను ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని అడిగారు. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారని జగన్ వరుస ప్రశ్నలు వేశారు.

సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని అడిగారు. రూ.15 లక్షలకు "స్పోర్ట్స్ కోటా'' పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి అని ప్రశ్నలు సంధించారు. టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటన్నారు. మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి... దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరాలన్నారు. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలని చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications