షర్మిలకు మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్న జగన్ ? త్వరలో ఆ ఇద్దరు సీనియర్లు..!
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ మొహం చాటేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారధిగా ఉన్న జగన్ సోదరి షర్మిల అన్నపై కత్తులు దూస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. తాజాగా పార్టీ శ్రేణులకు జగన్ 2.0 చూస్తారంటూ సంకేతం ఇచ్చేశారు.
గతంలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు అప్పట్లో వదిలేసిన కొందరు కీలక నేతలపై ఫోకస్ పెట్టారు. అన్నట్లుగానే జగన్ 2.0లో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు సిద్దమవుతున్నారు. అప్పట్లో వైసీపీలోకి వస్తామన్నా పట్టించుకోని నేతల్ని ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మాజీ పీసీసీ ఛీఫ్ శైలజానాథ్ వైసీపీలో చేరారు. అదే క్రమంలో మరో ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.

ఏపీలో మారిన రాజకీయ పరిస్ధితుల్లో ఉంటే కూటమి వైపు లేకపోతే వైసీపీవైపు అన్నట్లు నేతల ఆలోచన మారుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ ఉండలేక, అలాగని కూటమిలోకి వెళ్లలేక సతమతం అవుతున్న నేతలపై వైసీపీ ఫోకస్ పెడుతోంది. అలాగే గతంలో జగన్ తండ్రి వైఎస్ హయాంలో ఆయనతో కలిసి పనిచేయడమే కాకుండా సన్నిహితులుగా పేరున్న నేతలతో వైసీపీ అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా మాజీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి, కాకినాడ మాజీ ఎంపీ పల్లంరాజుతో టచ్ లోకి వెళ్లారు. వీరితో జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో వీరు వైసీపీలో చేరనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కుదేలైన కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి బీసీ నేత. వైఎస్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అలాగే జగన్ పై ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తిగా పేరుంది. మరోవైపు కాకినాడ మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి కూడా అయిన ఎంఎం పల్లంరాజు కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఆయనకు కూడా ఎప్పుడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేసిన చరిత్ర లేదు. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రిగా పనిచేసిన పల్లంరాజు చేరితే పార్టీకి ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications