YS Sharmila: ఏపీలో తొలి అడుగే ప్రభంజనంగా వైఎస్సార్ తనయ బిగ్ ప్లాన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైయస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవితవ్యం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అధిష్టానం షర్మిలకు బాధ్యత అప్పగించింది.
ఇప్పుడు అధిష్టానం పెట్టుకున్న అంచనాలను చేరుకోవడం వైయస్ షర్మిలకు కత్తిమీద సామే. ఆంధ్రప్రదేశ్లో తనకు, కాంగ్రెస్ పార్టీకి అపారమైన బలం ఉందని తొలిఅడుగు నుండే నిరూపించుకునే ప్రయత్నంలో వైయస్ షర్మిల ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు, ఎన్నికలవేళ అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల నాయకులను సైతం ఆకట్టుకోవడం కోసం ఆమె తొలిఅడుగే ఒక ప్రభంజనంగా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోయే తొలినాడే ఆమె వేయబోయే అడుగు ఒక్కసారిగా రాజకీయ వర్గాలను ఆకట్టుకునేలా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా వైయస్ షర్మిల పిసిసి సారథిగా బాధ్యతలు స్వీకరించే ముందు తొలుత ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ సమాధిని దర్శించుకుని, సమాధి వద్ద వైఎస్ఆర్ కు నివాళులు అర్పించి ఆ తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తుంది.
ఈ సందర్భంగా ఆమె కడపకు వచ్చే క్రమంలోనే భారీగా బల ప్రదర్శన నిర్వహించాలని వందలాది వాహనాలు, వేలాది అభిమానుల సందోహంతో ప్రదర్శనగా ఇడుపులపాయకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మాత్రమే కాకుండా పొరుగునే ఉన్న చిత్తూరు, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల నుండి కూడా జన సమీకరణ చేయడానికి వ్యూహరచన సాగుతున్నట్లుగా సమాచారం.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల అడుగు పెట్టే తొలినాడే కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం రాబోతుంది అన్న సంకేతాలను ఇచ్చేలా వైఎస్ షర్మిల పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారని సమాచారం. ఏది ఏమైనా వైయస్సార్ తెలంగాణ పార్టీతో ఒంటరిగానే తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన వైయస్ షర్మిల, ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఏపీలో సంచలనాలకు కేరాఫ్ గా మారతారు అన్నది అందరి అంచనా.












Click it and Unblock the Notifications