పవన్ కళ్యాణ్ పాత్రలోకి వైఎస్ షర్మిల ? ఆసక్తికరంగా రాజకీయం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉన్న సవాలక్ష కారణాల్లో వైఎస్ షర్మిల కూడా ఒకరు. అయినా పీసీసీ ఛీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక నామమాత్రపు విపక్షంగా మారిన వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారతారని అంతా భావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే బాధ్యత తీసుకున్న వైఎస్ షర్మిల విపక్షంగా మారి వైఎస్ జగన్ ను వెనక్కి నెట్టేంత సీన్ లేకపోయినా కనీసం పోటీ ఇస్తారని భావించారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోతోంది.
రాష్ట్రంలో 2014-19 మధ్య టీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని విధాలా అండగా నిలిచారు. ముఖ్యంగా సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఇబ్బంది ఎదురవుతుందని తెలియగానే అక్కడికి వాలిపోయేవారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానంటూ బాధితులకు భరోసా ఇచ్చేవారు. చివరకు ఎలాగోలా ఆ సమస్యను పరిష్కరించడం లేదా తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేవారు. దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని ఇలా ఆయనకు మద్దతిస్తున్నారన్న ప్రచారాన్ని వైసీపీ జనంలోకి తీసుకెళ్లేది. చివరికి జనం ఇది నమ్మే పరిస్ధితి వచ్చి చంద్రబాబు, పవన్ విడిగా పోటీ చేసినా ఒకటే అని భావించి 2019 ఎన్నికల్లో ఇద్దరినీ ఓడించారు.

సీన్ కట్ చేస్తే అప్పట్లో పవన్ కళ్యాణ్ పోషించిన తెరవెనుక మద్దతుదారు పాత్రను ఇప్పుడు వైఎస్ షర్మిల పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విపక్ష పార్టీగా ఉంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సింది పోయి విచిత్రంగా అదే ప్రభుత్వంపై పోరాడుతున్న అన్న వైఎస్ జగన్ ను షర్మిల టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటాలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయని తెలిసి అప్పుడప్పుడూ సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీపై పోరాటం మాత్రం ఆపడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం కంటే తోటి విపక్షం వైసీపీ మీదే షర్మిల పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ చర్యలకు షర్మిల బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. తిరుపతి లడ్డూ నుంచి కాకినాడ పోర్టు వరకూ ఇదే పరిస్ధితి.
దీంతో పవన్ కల్యాణ్ పాత్రలోకి షర్మిల ప్రవేశించినట్లు కనిపిస్తోంది. అప్పట్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతిస్తే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కు కలిపి షర్మిల మద్దతిస్తున్నారు. దీంతో జగన్ ఓవైపు అధికార, విపక్షాలు మరోవైపు అన్నట్లుగా పరిస్ధితి మారుతోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు షర్మిల విషయంలో చర్యలు తీసుకునే పరిస్ధితి లేదు. అయితే జనంలో మాత్రం షర్మిల పాత్ర ప్రశ్నార్థకమవుతోంది.












Click it and Unblock the Notifications