మద్యం షాపుల కేటాయింపు చంద్రబాబు పారదర్శకత, నిస్పాక్షికతకు ఉదాహరణ: వైఎస్ షర్మిల
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మద్యం షాపులు కేటాయించే డ్రా నేడు ఉదయం నుండి కొనసాగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు 89,882 మంది దరఖాస్తు చేసుకోగా, డ్రా తీసి షాపులు కేటాయించారు. దీంతో లిక్కర్ షాపుల కేటాయింపుపై, ఏపీ మద్యం పాలసీపై చంద్రబాబును టార్గెట్ చేసి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు
ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారన్నారు వైఎస్ షర్మిల. ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే అసలేం జరిగిందో అర్ధం చేసుకోవచ్చన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ
మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుందని చంద్రబాబును వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగిందని షర్మిల విమర్శించారు. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ప్రాణాలు పోతాయని హెచ్చరికలు చేశారని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరిస్తే సరిపోతుందా?
కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరినైనా లాటరి చిక్కితే, లైసెన్స్ ఇస్తారా ? లేక 30 శాతం కమీషన్ ఇస్తారా ? లేకుంటే చస్తారా ? అంటూ బెదిరించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తాం అంటూ బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. సీఎం గారు! ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి ? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
మీ పాపాల చిట్టాలు బయటపడకుండా ఇలా చేస్తున్నారా?
గత వైసీపీ "only cash" అని గుడిని మింగేస్తే ఇప్పుడు మీరు లింగాన్ని మింగేస్తున్నారు అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి సెటైర్లు వేశారు. ప్రైవేటు పేరుతో తక్కువ ధర అని చెప్పి, మద్యం ఏరులై పారించి, వేల కోట్లు దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపిందని మండిపడ్డారు. అందుకేనేమో మీ పాపాల చిట్టాలు రేపు బయటపడకుండా ఉండటం కోసం, పాత సర్కారు మద్యం స్కాములోని పాపాలపుట్టలు బద్దలుకాకుండా జాగ్రత్త పడుతున్నారన్నారు వైఎస్ షర్మిల.












Click it and Unblock the Notifications