పవన్ కు 'రాయల్' సంకటం - వైసీపీ చేతికి అస్త్రం..!!
జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. కిరణ్ రాయల్ పైన వస్తున్న ఆరోపణలతో వైసీపీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తోంది. పవన్ వైఖరి ఏంటని ప్రనశ్నిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్ వీడియోలను సర్క్యులేట్ చేస్తోం ది. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. ఇంకా వివాదం మాత్రం ఆగలేదు. దీంతో, ఇప్పుడు పవన్ ఈ వివాదం పైన ఏం చేయబోతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూటమిలో హాట్ టాపిక్ గా మారింది.
మహిళ ఆరోపణలతో
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. కిరణ్ రాయల్ తనను మోసం చేసారంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఈ ఆరోపణల పైన కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. 2016 లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. అయినా, ఈ వివాదం కంటిన్యూ అవుతోంది. తనను కిరణ్ రాయల్ మోసం చేసి కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేసారని తిరుపతి బైరాగపట్టడుగుకు చెందిన మహిళా ఆరోపించారు. ఆ మహిళ ఆత్మహత్యా యత్నం సంచలనం రేపింది. ఈ వీడియో పైన స్పందించిన కిరణ్ రాయల్ తనతో జరిగిన ఆర్దిక లావాదేవీల గురించి వివరించారు.

ఖండించిన రాయల్
కిరణ్ రాయల్ కు తాను కోటి 20 లక్షల మేర నగదు అప్పుగా ఇచ్చినట్లు మహిళ చెబుతున్నారు. తనకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని ఆరోపించారు. ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. డబ్బు గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కిరణ్ రాయల్ కారణంగానే తాను ఆత్మహత్య ఆలోచన చేయాల్సి వస్తుందని వివరించారు. అయితే, ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రగా కిరణ్ రాయల్ చెబుతున్నారు. ఆ మహిళ పైన చాలా కేసులు ఉన్నాయని వివరించారు. ఆ మహిళ చాలా మందిని ముంచేసారని..పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
పవన్ చర్యలు తీసుకుంటారా
ఇటు సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ మహిళతో మాట్లాడిన ఆడియో.. కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వివాదం పై పవన్ చర్యలు తీసుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పైన మహిళ చేస్తున్న ఆరోపణల వ్యవహారం వివాదంగా మారింది. మరి, ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications