"పులివెందుల ఎమ్మెల్యే"కు కౌంటర్ కనిపెట్టిన వైసీపీ..! మండలిలో రచ్చరచ్చ..!
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కూటమి సర్కార్.. వైఎస్ జగన్ ను సైతం విపక్ష నేతగా గుర్తించడం లేదు. నిబంధనల ప్రకారం కనీస సీట్లు 18 రాకపోవడంతో ఇలా వైసీపీకి ప్రధాన విపక్ష హోదా ఇవ్వకపోవడంపై చర్చను పక్కనబెడితే, మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన జగన్ ను పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తావిస్తూ మంత్రులు, అధికార కూటమి ఎమ్మెల్యేలు టీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పులివెందుల ఎమ్మెల్యే కామెంట్ కు స్పందించని వైసీపీ నేతలు ఇవాళ మాత్రం కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించారు. దీంతో టీడీపీ సహా కూటమి ఎమ్మెల్సీలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. అసలే మండలిలో మెజార్టీ ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. సీఎంను కుప్పం ఎమ్మెల్యే అనడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ సభ్యులు అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని వైసీపీ సభ్యులు కించపరిచారంటూ మండిపడ్డారు. అయితే వైసీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడితే అందులో తప్పేముంది? మా నాయకుడు వైయస్ జగన్ గారిని పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనాలి అని తెలియదా? మీరు ఎంత కాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో మేము అంత… pic.twitter.com/QqZvsbh1rt
— YSR Congress Party (@YSRCParty) September 25, 2025
దీంతో వైసీపీ ఎమ్మెల్యే రమేశ్ యాదవ్ పై చర్యలు కోరుతూ మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. జగన్‌ను పులివెందుల పులకేశి అంటే ఒప్పుకుంటారా అని మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications