ఏపీలో ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ల వివాదం
Perni Nani: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

ఈ పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారం క్రమంగా ముదురుతోంది. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం మధ్య మాటలదాడికి దారి తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదున్నర లక్షలకు పైగా పోలైన పోస్టల్ బ్యాలెట్లు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా అభ్యర్థుల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతాయనే అంచనాలు ఉన్నాయి.
ఎన్నికల అధికారులు తెలుగుదేశానికి వైపు మొగ్గు చూపుతున్నారని, ఆ పార్టీకి అండగా ఉంటోన్నారంటూ ఆరోపిస్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు మరో అడుగు ముందుకేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్‌పై అభ్యంతరం తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అన్నారు.

ఈ మేరకు మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మద్దాల గిరి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ గ్రివెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్ లైన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కసం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఎన్నికల అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని పేర్ని నాని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications