వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తే శిరసావహిస్తా -ఆపై సీఎం జగన్‌ను ప్రశ్నించను: ఎంపీ రఘురామ
వైసీపీ నుంచి గెలిచి, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనే తిరుబావుటా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో సవాలు విసిరారు. సీఎం పదవిని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తోన్న జగన్‌కు బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించిన ఆయన, ఆ పని చేసినందుకు పార్టీ ఎంపీలు తనపై విమర్శలకు దిగుతున్నారని, మాటల కంటే చేతల్లో సస్పెన్షన్ వేటేసి చూపిస్తే తానూ సంతోషిస్తానని రఘురామ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయనో వీడియో క్లిప్ విడుదల చేశారు..

ఎంపీ సురేశ్‌కు కౌంటర్
అక్రమాస్తులకు సంబంధించి 11 చార్జిషీట్లలో నిందితుడైన జగన్.. సీఎం అయినందుకు కేసుల విచారణ సాగకపోగా, సహ నిందితులకు కీలక పదవులు ఇస్తూ, సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇటీవల సీబీఐ కోర్టును ఆశ్రయించారు. రఘురామ తీరుపై వైసీపీకే చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు. రఘురామకు సిగ్గుంటే నర్సాపురం వచ్చి రాజీనామా చేయాలని, అనర్హత ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే, తామే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని ఎంపీ సురేశ్ అన్నారు. ఈ కామెంట్లకు రఘురామ రియాక్ట్ అయ్యారు. నందిగంకు అదే స్థాయిలో కౌంటరిచ్చారు...

ఏ1, ఏ2 కంటే పవర్ ఫుల్
''ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన మా పార్టీ ఎంపీ ఇవాళ నాకు చాలా ఆనందం కలిగించారు. రోజూ 4కిలోమీటర్లు చేసే వాకింగ్ కాస్తా 6కిలోమీటర్లు నడిచినంత ఉల్లాసంగా అనిపిస్తోంది. అయితే, ఏ1, ఏ2 కంటే పవర్ ఫుల్ అయిన ఆ ఎంపీ ఒక ముఖ్యవిషయం తెలుసుకోవాలి. నాపై సీబీఐకి ఫిర్యాదు మాత్రమే అందింది. ఇంకా కేసు కట్టలేదు. అదే జగన్ మాత్రం అక్రమాస్తుల కేసులో ఏకంగా 16 నెలల జైలు శిక్షతోపాటు, చార్జిషీట్లలో నిందితుగానూ కొనసాగుతున్నారు. కేవలం ప్రశ్నిస్తున్నందుకే నాపై చర్యలు తీసుకుంటే..

వైసీపీ నుంచి బహిష్కరిస్తే స్వాగతం
ఎంపీ చెప్పిన విధంగానో, సీఎం మనసులో ఉన్న మాటగానో నా మీద ఆ వేటు వ్యవహారమేంటో పూర్తి చేస్తే ధన్యుడిని అనుకుంటా. ఒక్క కేసు కూడా లేని నన్ను.. 11 కేసుల్లో నిందితుడైన జగన్ తో పోల్చి కీర్తిప్రతిష్టతలు పెంచకండి. నా బహిష్కరణకు సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా క్రమశిక్షణ గల కార్యకర్తగా శిరసావహిస్తాను. అంతేకాదు, నన్ను వైసీపీ నుంచి బహిష్కరిస్తే సీఎం జగన్ ను ప్రశ్నించడం కూడా మానేస్తాను. నిర్ణయం తీసుకోవాల్సింది పెద్దలే.












Click it and Unblock the Notifications