చంద్రబాబుకు సాయిరెడ్డి బర్త్ డే విషెస్- ఇప్పుడు ఇదే ట్రెండింగ్..!
ఏపీలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేరు చెబితే అంతెత్తున లేచే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వింతగా కనిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ రికార్డులు సృష్టించిన సాయిరెడ్డి.. ఈ మధ్య ఆ వార్ కు ముగింపు పలకడమే కాకుండా ఇవాళ ఏకంగా చంద్రబాబు పుట్టినరోజున తనదైన శైలిలో హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇవాళ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ టీడీపీ నేతలతో పాటు ఇతర రాజకీయ నేతలు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇందులో సాయిరెడ్డి " టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా." అంటూ తెలిపారు.
గతంలో చంద్రబాబు పుట్టినరోజున సైతం తీవ్ర విమర్శలతో ట్వీట్లు పెట్టిన సాయిరెడ్డి.. గత కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా తారకరత్న ఆస్పత్రిలో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య అనుబంధం కాస్త పెరిగింది. అదే సమయంలో ఆస్తుల గురించి వచ్చిన విమర్శలకు స్పందించే క్రమంలో చంద్రబాబు తనకు అన్న అవుతాడంటూ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న భార్యవైపు నుంచి చంద్రబాబుకు, తనకు బంధుత్వం ఉందన్నారు. అప్పటి నుంచి సాయిరెడ్డి తీరులో చాలా మార్పు కనిపిస్తోంది.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023












Click it and Unblock the Notifications