కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ? విజయ సాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం ఏపీ రాజకీయాలపై భవిష్యత్తులో ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం అధికార వైసీపీని కలవరపెడుతుందన్న అంచనాలు మాత్రం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో తమకు ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ.. తెలంగాణలో తమకు ఇంతకాలం మిత్రుడిగా ఉన్న కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పనిచేసి కాంగ్రెస్ ను గెలుపులో కీలక పాత్ర పోషించడం వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ వేసిన ఓ డైలాగ్ ఇప్పుడు తెరపైకి వస్తోంది. అయితే దీనిపై వైసీపీ స్పందించకుండా ఉంటే ఎలాంటి చర్చా లేదు. కానీ టీడీపీ అనుకూల మీడియా ఆ డైలాగ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రచారనికి వైసీపీ స్పందిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎల్లో మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారంపై ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో , చంద్రబాబును, ఆయన అనుకూల మీడియానూ సాయిరెడ్డి టార్గెట్ చేశారు.

గతంలో 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచాక 2019లో ఏపీ ఎన్నికలు వచ్చాయి. అందులో 2018 ఎన్నికల్లో తెలంగాణలో తమకు పోటీనిచ్చిన టీడీపీని ఏపీ ఎన్నికల్లో టార్గెట్ చేస్తూ కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే ఏపీలో వైసీపీ విజయానికి అన్ని విధాలా సహకరించారు. దీంతో పాటు జగన్ సీఎం అయ్యాక విజయవాడలో ఆయన ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమితో పరిస్ధితి రివర్స్ అవుతోంది.
తెలంగాణలో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి తనవంతు తోడ్పడింది. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు గతంలో జరిగిన దానికి కౌంటర్ గా కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ప్రచారం చేస్తోంది. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి ఇవాళ కౌంటర్ ఇచ్చారు.

"కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా 'స్వీయ సంతృప్తి' పొందుతోంది. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేశారా? అక్కడి ప్రజలకు ఈయనొక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపునకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలి!" అంటూ సాయిరెడ్డి ట్వీట్ కౌంటర్ వేశారు.












Click it and Unblock the Notifications